రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర’ కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. అయితే, అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేదు. దీంతో ఆయన తదుపరి సినిమా (RT 76) పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుంది. ఒక ప్రత్యేకమైన సాంగ్ చిత్రకరణ జరుగుతుంది.
ఇటీవలే స్పెయిన్‌లో ఒక పాట చిత్రీకరణను ముగించిన ఈ బృందం ఇప్పుడు హైదరాబాద్‌లో మరో పాటను చిత్రీకరించే పనిలో ఉంది. గతంలో రవితేజతో ఖిలాడిలో జతకట్టిన డింపుల్ హయాతి, RT 76 తారాగణంలో చేరినట్లు ఆమె ధృవీకరించింది. ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం రవితేజతో కలిసి ఒక పాటను చిత్రీకరిస్తున్నారని డింపుల్ పంచుకుంది. ఆపై "చార్ట్‌బస్టర్" రాబోతోందని అభిమానులకు సూచించింది. ఆమెతో పాటు ఆషికా రంగనాథ్ కూడా ఇందులో భాగం కానుంది. గతంలో రవితేజ, డింపుల్ కలిసి 'ఖిలాడి' సినిమాలో 'ఫుల్ కిక్' అంటూ ఒక పాటలో ఇద్దరూ దుమ్మురేపారు.
ఈ ప్రాజెక్ట్‌కు మొదట ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, అనార్కలి అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని సమాచారం. ఇది 2026 సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉంది. చాలా రోజుల తర్వాత రవితేజ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంతో రానున్నడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


