సీసీటీవీ ఫుటేజ్‌ షేర్‌ చేసిన రాహుల్‌

Rahul Sipligunj Shared CCTV Footage And Appeal To KTR For Justice - Sakshi

హైదరాబాద్‌ : తనకు న్యాయం చేయాలని సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తనపై పబ్‌లో జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన రాహుల్‌.. తనపై ఉద్దేశపూర్వకంగా దాడి జరిగిందని పేర్కొన్నారు. తను టీఆర్‌ఎస్‌ పార్టీ కోసమే నిలిచానని, టీఆర్‌ఎస్‌కి ఓటు వేశానని అన్నారు. కేటీఆర్‌పై ఎంతో నమ్మకం ఉందని.. ఆయన తనకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తనకు నిష్పాక్షిక న్యాయం కావాలని డిమాండ్‌ చేశారు. 

‘నాపై జరిగిన దాడికి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు చూడండి. ఆ గ్యాంగ్‌ నన్ను ఏవిధంగా రెచ్చగొట్టిందో, దాడి చేసిందో తెలుస్తోంది. ఈ వీడియో చూసి నిజం వైపు నిలబడండి. కేటీఆర్‌ సార్‌, నేను ఎప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీ కోసమే పనిచేశాను. నేను ఈ గడ్డ మీద పుట్టాను కాబట్టి టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేశాను. నేను బతికి ఉన్నంతకాలం తెలంగాణకు సేవ చేస్తాను. సార్‌ మేము నమ్మి నాయకులను ఎన్నుకుంటాం.. కానీ వాళ్లు ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. మన సొంత టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సోదరులు పబ్లిక్‌లో ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం చూసి షాక్‌ అయ్యాను. వాళ్ల సోదరుడికి అధికారం ఉందని దాడికి పాల్పడ్డారు. (చదవండి : ‘బిగ్‌బాస్‌’పై దాడి; అసలేం జరిగిందంటే?)

సారు ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలి. నాకు న్యాయం జరగాలి. ఈ ఘటనపై మీరు తగిన చర్యలు తీసుకుంటారని ఎదురు చూస్తున్నాను. ఈ కేసును పరిశీలించాల్సిందిగా  నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఈ ఘటనకు సంబంధించి నా తప్పు ఉంటే నాపై కూడా చర్యలు తీసుకోండి. కానీ నేను( లేదా కామన్‌ మ్యాన్‌) ఒకవేళ ఆ తప్పు చేసి ఉండకపోతే అలాంటి పరిస్థితిని ఎందుకు ఎదుర్కోవాలి?. మీరు నాకు, మాకందరికీ నాయకుడు. నేను నిష్పాక్షిక న్యాయం కోసం డిమాండ్‌ చేస్తున్నాను. ఎంతో నమ్మకంతో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి క్రూరమైన వ్యక్తులు అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఆపాల్సిన సమయం వచ్చింది. మీరు కచ్చితంగా సరైన పనే చేస్తారని నేను నమ్ముతున్నాను. థాంక్యూ సార్‌’ అని రాహుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. 

కాగా, గచ్చిబౌలిలోని ప్రిజమ్‌ పబ్‌లో బుధవారం రాత్రి రితేష్‌రెడ్డితోపాటు మరికొందరు రాహుల్‌పై బీరు సీసాలతో దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్‌ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు 324, 34 రెడ్‌విత్‌, 354 సెక్షన్ల కింద రితేష్‌రెడ్డితోపాటు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. (చదవండి : రాహుల్‌ సిప్లిగంజ్‌పై దాడి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top