అది వేరే లెవల్‌ | Prabhu Deva Laxmi Movie Pressmeet in Chennai | Sakshi
Sakshi News home page

అది వేరే లెవల్‌

Aug 20 2018 10:27 AM | Updated on Aug 20 2018 10:27 AM

Prabhu Deva Laxmi Movie Pressmeet in Chennai - Sakshi

లక్ష్మీ చిత్ర యూనిట్‌

తమిళసినిమా: ఆ చిత్రం వేరే లెవల్‌. దానితో పోల్చకండి అని అన్నారు నటుడు ప్రభుదేవా. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన చిత్రం లక్ష్మీ. దేవి చిత్రంతో హిట్‌ కొట్టిన ఈయన ఇప్పుడు లక్ష్మీ అంటున్నారు. ఇది డాన్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. ప్రమోద్‌ ఫిలింస్, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి విజయ్‌ దర్శకుడు. ప్రభుదేవాకు జంటగా నటి ఐశ్వర్యరాజేశ్‌ నటించిన ఇందులో బేబీ దిత్య ప్రధాన పాత్రలో నటించింది. శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ శనివారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో నటి ఐశ్వర్యరాజేశ్‌ మాట్లాడుతూ..ఈ చిత్రంలో తన పాత్ర చిన్నదే అయినా కథ అంతగా తనను ఆకట్టుకుందని ఐశ్వర్యరాజేశ్‌ అన్నారు. ప్రభుదేవాతో కలిసి నటించడం చాలా మంచి అనుభవం అని పేర్కొన్నారు.

ప్రభుదేవా మాట్లాడుతూ లక్ష్మీ చిత్రాన్ని చూసి రవీంద్రన్‌ విడుదల హక్కులను పొందారన్నారు. దర్శకుడు విజయ్‌ కలిసి డాన్స్‌ ఇతి వృత్తంతో చిత్రం చేద్దాం అని చెప్పగానే సాధా సీదా చిత్రంలా కాకుండా ఇండియా స్థాయిలో ఆ చిత్రం ఉండాలని చెప్పానన్నారు. పలువురు చిన్నారులతో విజయ్‌ అదే స్థాయిలో లక్ష్మీ చిత్రాన్ని తీశారని చెప్పారు. ఆయన దర్శకత్వంలో దేవీ, లక్ష్మీ చిత్రాల్లో నటించానని, అదే విధంగా దేవి– 2 చిత్రంలోనూ నటించాలని నిర్ణయించుకున్నానన్నారు. తాను ఈ చిత్రంలో 4,5 టేక్‌లు తీసుకున్నా, పిల్లలు ముఖ్యంగా దిత్యా సింగిల్‌ టేక్‌లో ఫుల్‌ మూమెంట్‌ను ఆడేసేదన్నారు. ఇంతకు ముందు డాన్స్‌ నేపథ్యంలో సలంగై ఒళి వచ్చిన విషయం తెలిసిందేనన్నారు. అది వేరే లెవల్‌ అని, ఆ చిత్రంతో లక్ష్మీ చిత్రాన్ని పోల్చవద్దు అని అన్నారు. అయితే ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని ప్రభుదేవా అన్నారు. దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ ఈ చిత్రం కోసం ప్రభుదేవా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నటించారని అన్నారు. ఆయన తమ టీమ్‌కు అతి పెద్ద పిల్లర్‌ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement