బిగ్‌బాస్‌ షోను సెన్సార్‌ చేయండి

Petition On Bigg Boss Reality Show Should Be Censored - Sakshi

పెరంబూరు: బిగ్‌బాస్‌కు షాకిచ్చారో న్యాయవాది. ఈ రియాలిటీ గేమ్‌ షోను సెన్సార్‌ చేయాలంటూ చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం విజయ్‌ టీవీకి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, సెన్సార్‌ బోర్డుకు రిట్‌ పిటిషన్‌ దాఖాలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే విజయ్‌ టీవీలో ప్రసారం అయిన బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో సీజన్‌ 1, 2 ఎంతగా పాపులర్‌ అయ్యాయో తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా పలువురు నటీనటులు ప్రాచుర్యం పొందారు. నటుడు కమలహాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ గేమ్‌ షోకు తాజాగా సీజన్‌–3 మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో సుదన్‌ అనే న్యాయవాది బిగ్‌బాస్‌–3  రియాలిటీ షోను నిషేధించాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

అందులో.. నటుడు కమలహాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోను పిల్లల నుంచి పెద్దల వరకూ వీక్షిస్తున్నారన్నారు. ఈ రియాలిటీ షోలో నటీనటులు అశ్లీలకరంగా దుస్తులు ధరించడం, ద్వందర్థాల సంభాషణలను మాట్లాడడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇవి ప్రేక్షకులను చెడు దారి పట్టించేవిగా ఉన్నాయన్నారు. వారి మనోభావాలకు ముప్పు వాటిల్లే విధంగా ఉంటున్నాయన్నారు. కాబట్టి ఈ రియాలిటీ షోను సెన్సార్‌ చేయించి ప్రసారం చేయాలని కోరారు. అంతవరకూ రియాలిటీ షో ప్రసారంపై నిషేధం విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్‌ వాదనలను విన్న న్యాయమూర్తులు ఎస్‌.మణికుమార్, సుబ్రమణియం ప్రసాద్‌లు ఈ పిటిషన్‌పై రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, విజయ్‌ టీవీ.నిర్వాహక చైర్మన్‌కు, కేంద్ర సెన్సార్‌ బోర్డుకు 3 వారాల్లోగా నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదే«శించారు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top