సినిమా కోసం ఏరా.. పోరా అని తిట్టుకున్నాం – నితిన్‌

Pawan Kalyan to be the chief guest at Chal Mohana Ranga pre release - Sakshi

‘‘16ఏళ్ల నా సినీ కెరీర్‌లో 25వ సినిమా ‘ఛల్‌ మోహన్‌రంగ’. నా చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ‘తొలిప్రేమ’ సినిమా చూసిన తర్వాతే హీరో అవ్వాలనుకున్నా’’ అని నితిన్‌ అన్నారు. నితిన్, మేఘా ఆకాశ్‌ జంటగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఛల్‌ మోహన్‌రంగ’. పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్, శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ప్రీ– రిలీజ్‌ వేడుకకు హీరో పవన్‌కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నితిన్‌ మాట్లాడుతూ– ‘‘నాకు నటన రాకున్నా నేర్పి, తొలి సినిమా (జయం)కు అవకాశం ఇచ్చిన నా  గురువు తేజగారికి థ్యాంక్స్‌. నేను సినిమాల్లోకి వెళతానంటే నా తల్లితండ్రులు వద్దనకుండా ప్రోత్సహించారు. నేను సినిమాలకు తప్ప వేరే దేనికీ పనికిరానని వారు ముందుగానే అనుకున్నారేమో(నవ్వుతూ). దర్శకుడు చైతన్య నాకు చాలా ఏళ్ల నుంచి మంచి ఫ్రెండ్‌. సినిమా కోసం ఏరా.. పోరా అని తిట్టుకున్నాం. ఈ చిత్రం తనకి మంచి హిట్‌ ఇవ్వాలి. తమన్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. నా కెరీర్‌లో ‘ఛల్‌ మోహన్‌రంగ’ 25వ సినిమా అని ప్రత్యేకమైంది కాదు.

ఈ సినిమాని పవన్‌గారు, త్రివిక్రమ్‌గారు, మా నాన్నగారు నిర్మించడమే ప్రత్యేకం. నా లైఫ్‌లో ఇష్టమైన వ్యక్తుల్లో ఈ ముగ్గురే ఉంటారు’’ అన్నారు. ‘‘నా బలం నితిన్‌. తనతో సినిమా చేయాలని బలంగా కోరుకున్నా.. కుదిరింది. తమన్‌గారికి నేను ఓ 50 పాటలు రాసిఉంటా. ఈ చిత్రానికి చక్కని సంగీతం అందించారాయన’’ అన్నారు కృష్ణచైతన్య. ‘‘కృష్ణ చైతన్య చక్కగా తెరకెక్కించారు. సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. నితిన్‌తో నాకు తొలి సినిమా. కచ్చితంగా హిట్‌ అవుతుంది’’ అన్నారు తమన్‌. సుధాకర్‌రెడ్డి, సమర్పకురాలు నిఖితారెడ్డి, కెమెరామెన్‌ ఎం. నటరాజ సుబ్రమణియన్, నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, ‘దిల్‌’ రాజు, కిరణ్, కె.ఎల్‌. దామోదర  ప్రసాద్, కె.కె. రాధామోహన్, మేఘా ఆకాశ్, నటి లిజీ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top