పాటలు నచ్చడంతో సినిమా చేశా | Pandugadi Photo Studio Audio Launch | Sakshi
Sakshi News home page

పాటలు నచ్చడంతో సినిమా చేశా

Aug 12 2019 12:40 AM | Updated on Aug 12 2019 12:40 AM

Pandugadi Photo Studio Audio Launch - Sakshi

సురేష్, దిలీప్‌ రాజా, రిషిత, చార్మీ, అలీ, యాజమాన్య, పూరి జగన్నాథ్, బోయపాటి, శ్రీకాంత్, సాంబిరెడ్డి

‘‘ఒకరోజు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ కాల్‌ చేసి ఆఫీసుకు రమ్మన్నారు. ఆదాయపు పన్ను విషయం ఏమో అనుకున్నా. ‘నా ఫ్రెండ్‌ సినిమా చేస్తున్నారు.. మీరు అందులో నటించాలి’ అన్నారు. ఆ ఆఫీసర్‌ ఫ్రెండే మా దిలీప్‌ రాజా అని తెలిసింది. కట్‌ చేస్తే... మొదట నాకు కొన్ని పాటలు పంపి వినమన్నారు. ఆ పాటలు నచ్చడంతో సినిమా చేస్తానని చెప్పా’’ అని అలీ అన్నారు. దిలీప్‌ రాజా దర్శకత్వంలో అలీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’.

‘వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది’ అనేది ట్యాగ్‌లైన్‌. పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా పాటలను దర్శకులు పూరి జగన్నాథ్, బోయపాటి శీను విడుదల చేశారు. సినిమా ట్రైలర్‌ను దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి రిలీజ్‌ చేశారు. అలీ మాట్లాడుతూ– ‘‘మా సినిమా కథ కూడా చాలా బాగుంది. వెంకటేశ్వర విద్యాలయ సంస్థ అధినేతగా ఉన్న సాంబిరెడ్డిగారు సినిమాలపై ఇష్టంతో నాతో ఈ సినిమా నిర్మించారు.

మా చిత్రం అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘పండుగాడు ఫోటో తీస్తే ఎవరికైనా పెళ్లి అయిపోతుంది అనేది ఈ చిత్ర కథ. రెండేళ్లు ఈ కథ కోసం కష్టపడ్డా. జంధ్యాలగారి మార్క్‌ కామెడీతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు దిలీప్‌ రాజా. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బాపట్ల ఎంపీ నందిగాం సురేష్, నటీనటులు బాబూమోహన్, శ్రీకాంత్, నరేష్, ‘అల్లరి’ నరేష్, చార్మి, ఖయ్యుమ్, ప్రవీణ, అనిల్‌ కడియాల తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement