లైంగిక ఆరోపణలు ఉచ్చులో ‘ఆస్కార్స్‌ బాస్‌’

Oscars Boss John Bailey Accused Of Sexual Harrassment - Sakshi

వాషింగ్టన్‌ : 90వ ఆస్కార్‌ వేడుకలు జరిగి ఎన్నో రోజులు అవడం లేదు, అప్పుడే ఆ అకాడమీకి చెందిన బాస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అకాడమీ ఆప్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ అధ్యక్షుడు జాన్‌ బైలీపై మూడు లైంగిక వేధింపుల ఫిర్యాదులు నమోదైనట్టు హాలీవుడ్‌ రిపోర్టర్‌, వెరైటీ రిపోర్టు చేశాయి. ఈ ఆరోపణలపై విచారణ కూడా ప్రారంభమైందని తెలిపాయి. 

డైరెక్టర్‌, సినిమాటోగ్రఫర్‌ అయిన బైలీ, గత ఏడాది ఆగస్టులో అకాడమీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ‘అమెరికన్ గిగోలో’, , ‘ది బిగ్ చిల్’, ‘గ్రౌండ్ హోగ్ డే’ వంటి సినిమాలకు ఈయన పనిచేశారు. ఈ విషయంపై స్పందించిన అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌.. అన్ని పార్టీలను రక్షించడానికి అకాడమీ ఫిర్యాదులను రహస్యంగా ఉంచుతామని తెలిపింది. తమ ప్రవర్తనా నియమావళి ప్రమాణాల ప్రకారం అకాడమీ సభ్యులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను కమిటీ మెంబర్‌షిప్‌ సమీక్షిస్తుందని పేర్కొంది.  అన్ని సమీక్షలు పూర్తయిన తర్వాత బోర్డు ఆఫ్‌ గవర్నర్లకు రిపోర్టు చేయనున్నామని చెప్పింది. పూర్తిగా రివ్యూ ముగిసే వరకు దీనిపై ఎలాంటి కామెంట్‌ చేయమని అకాడమీ వెల్లడించింది.

ప్రస్తుతం హాలీవుడ్‌లో లైంగిక వేధింపులు పెద్ద ఎత్తున్న చర్చనీయాంశమయ్యాయి. హాలీవుడ్ మొఘల్ హార్వే వైన్‌స్టీన్‌ సెక్స్ స్కాండల్‌కు, హాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ‘మీటూ ఉద్యమం’ కూడా భారీ ఎత్తున్న ప్రచారం జరిగింది. ఈ ఉద్యమం సందర్భంగా వైన్‌స్టీన్‌కు వ్యతిరేకంగా 70 మందికి పైగా ఫిర్యాదులు నమోదుచేశారు. గతేడాది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సస్‌ నుంచి వైన్‌స్టీన్‌ను తొలగించేశారు.  వైన్‌స్టీన్‌ కంపెనీ కూడా దివాలా తీయబోతుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top