పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో కీలక పాత్రలో నయన్‌

Is Nayanthara Act In Mani Ratnam Movie - Sakshi

 ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రంలో అగ్రనటి నయనతార నటించబోతోందా? మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ పొన్నియన్‌ సెల్వన్‌. దీన్ని ఇంతకుముందే నటుడు విజయ్, టాలీవుడ్‌ నటుడు మహేశ్‌బాబు, బాలీవుడ్‌ సుందరి ఐశ్వర్యరాయ్‌ వంటి వారితో తెరకెక్కించడానికి మణిరత్నం సన్నాహాలు చేశారు. అయితే అప్పట్లో బడ్జెట్‌ తదితర విషయాలు సెట్‌ కాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని మణిరత్నం విరమించుకున్నారు. అయితే అది తాత్కాలికంగానే. మల్టీస్టారర్‌ చిత్రాలు తీయడంలో మణిరత్నం సిద్ధహస్తుడన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఆయన అరవిందస్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్‌ విజయ్, జ్యోతిక వంటి స్టార్స్‌తో తెరకెక్కించిన సెక్క సివందవానం చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

తాజాగా ఆయన పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రాన్ని హ్యాండిల్‌ చేయడానికి సిద్ధం అయ్యారు. ఈసారి నటుడు విక్రమ్, కార్తీ, జయంరవి, టాలీవుడ్‌ స్టార్‌ నటుడు మోహన్‌బాబు, ఐశ్వర్యరాయ్, కీర్తీసురేశ్‌ వంటి వారిని ఎంచుకున్నారు. అంతే కాదు మరో అగ్రనటి నయనతారను ఈ మల్టీస్టారర్‌ చిత్రంలోని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇక బాలీవుడ్‌ బిగ్‌బీ కూడా ఇందులో నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ భారీ చారిత్రక కథా చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఒకటైన అరుళ్‌మొళి వర్మగా జయంరవి, ఆధిత్య కరికాలన్‌గా విక్రమ్, వల్లవరాజయన్‌ వంధియదేవన్‌గా కార్తీ, పెరియ పళవేట్టైయార్‌గా మోహన్‌బాబు, సుందర చోళర్‌ పాత్రలో అమితాబ్‌బచ్చన్, కుందవై నాచ్చియార్‌గా నటి కీర్తీసురేశ్, నందినిగా ఐశ్వర్యరాయ్‌ నటించబోతున్నట్లు తెలిసింది.

తాజాగా ఒక ముఖ్య పాత్రలో నయనతారను నటింపచేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వందియదేవన్‌ను శ్రీలంకకు తీసుకెళ్లి అరుళ్‌ వర్మను రక్షించి తమిళనాడుకు తీసుకొచ్చే ముఖ్య పాత్రలో నయనతారను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారపూర్వక ప్రకటన వెలువడాల్సి ఉంది. చిత్రంలో తారాగణం ఎంపిక చివరి దశకు చేరుకుందని, చిత్రాన్ని సెప్టెంబరులో సెట్‌ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రాన్ని మణిరత్నం మెడ్రాస్‌ టాకీస్, లైకా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top