కృష్ణవంశీ దర్శకత్వంలో? | Nayantara acts in Krishnavamsi next film | Sakshi
Sakshi News home page

కృష్ణవంశీ దర్శకత్వంలో?

Oct 19 2013 12:24 AM | Updated on Sep 1 2017 11:45 PM

కృష్ణవంశీ దర్శకత్వంలో?

కృష్ణవంశీ దర్శకత్వంలో?

ఒక్కోసారి అగ్ర హీరోల పక్కన అవకాశమొచ్చినా చేయలేని పరిస్థితి మన కథానాయికలది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ టైమ్‌లో ఇలాంటి పరిస్థితినే త్రిష ఎదుర్కొన్నారు. నిజానికి త్రిష, వెంకటేష్ హిట్ కాంబినేషన్.

ఒక్కోసారి అగ్ర హీరోల పక్కన అవకాశమొచ్చినా చేయలేని పరిస్థితి మన కథానాయికలది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ టైమ్‌లో ఇలాంటి పరిస్థితినే త్రిష ఎదుర్కొన్నారు. నిజానికి త్రిష, వెంకటేష్ హిట్ కాంబినేషన్. కానీ ఆ సినిమాలో మాత్రం ఆమె నటించడానికి ససేమిరా అన్నారు. దానికి కారణం మహేష్. అతడు, సైనికుడు చిత్రాలతో మహేష్‌కు కూడా తను మంచి జోడీ అనిపించుకుంది. అలాంటిది ఇప్పుడు ఉన్నట్లుండి అదే మహేష్‌కి వదినగా కనిపిస్తే నిజంగా అది ఆమెకు డామేజే కదా. 
 
 ఇప్పుడు దాదాపు అలాంటి పరిస్థితినే నయనతార కూడా ఎదుర్కొంటున్నారని ఫిలింనగర్ టాక్. సీనియర్ హీరోలైన రజనీకాంత్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో జతకట్టి వారికి సరైన జోడీ అనిపించుకున్నారు నయన. కానీ ఈ మధ్య ఈ మలయాళ మందారం మైండ్ సెట్‌లో మార్పొచ్చిందట. సీనియర్ హీరోల పక్కన నటిస్తే... తనను కూడా సీనియర్స్ లిస్ట్‌లో వేసేస్తారని, అందుకని ఇక నుంచి యువ హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నయన భావించారని ఆమె సన్నిహిత వర్గాల సమాచారం. 
 
 అందుకు తగ్గట్టే... ఆర్య, అజిత్, ఉదయనిధి స్టాలిన్, గోపిచంద్ లాంటి యంగ్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారామె. ఇప్పుడు అనుకోకుండా ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ నుంచి ఓ మంచి ఆఫర్ వరించిందని వినికిడి. వెంకటేష్, చరణ్ కలిసి ఓ మల్టీస్టారర్‌లో నటించనున్న విషయం తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించనున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా కాజల్ అగర్వాల్‌ని ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలిసింది. వెంకటేష్ సరసన నయనతారను నటింపజేయాలని కృష్ణవంశీ భావిస్తున్నారట. 
 
 ప్రస్తుతం నయనతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. పైగా ఇందులో రామ్‌చరణ్‌కి బాబాయ్‌గా వెంకటేష్ నటిస్తున్నారని వినికిడి. మరి యువహీరోలకే ప్రాధాన్యత ఇస్తున్న నయన.. చరణ్‌కి పిన్నిగా నటించడానికి అంగీకరిస్తారా? లేదా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. పారితోషికం కంటే.. పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కథానాయికగా నయనకు పేరుంది. మరి ఆ పేరును ఆమె నిలబెట్టుకుంటుందో? లేదో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement