భవిష్యత్తులో వాళ్లే స్టార్స్‌

భవిష్యత్తులో వాళ్లే స్టార్స్‌


‘‘పదేళ్ల తర్వాత సూపర్‌స్టార్‌ అంటే కంటెంటే. దాన్ని మించిన స్టార్‌డమ్‌ ఉండదు. అప్పుడు థియేటర్‌కి వెళ్లి బ్యానర్లు కట్టి, దండలు వేద్దామనే ప్రేక్షకులు ఉండరు. ఏ సినిమాలో దమ్ముంది? ఎందులో కంటెంట్‌ ఉంది? అనే ఆలోచిస్తారు. కంటెంట్‌ని నమ్ముకున్నోళ్లే భవిష్యత్తులో స్టార్స్‌. ఆల్రెడీ ఈ మార్పు మొదలైంది. దీనికి కారణం ప్రేక్షకులే. గతేడాది డిఫరెంట్‌ సినిమాలను ఆదరించి, రెగ్యులర్‌ సినిమాలను తిరస్కరించారు’’ అని హీరో నాని అన్నారు. నాని, కీర్తీ సురేశ్‌ జంటగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మించిన ‘నేను లోకల్‌’ ఫిబ్రవరి 3న విడుదలవుతోంది. నాని చెప్పిన సంగతులు...



►  ‘దిల్‌’ రాజుగారితో ఎప్పుడో సినిమా చేయాలి. ఆయన నా దగ్గరకి పంపినన్ని కథలు ఇంకెవరికీ పంపలేదనుకుంటా. ఈ కథ వినగానే రాజుగారితో, మన వెయిటింగ్‌కి ఎండ్‌ కార్డ్‌ పడిందని చెప్పా. పాప్‌కార్న్‌ తింటూ ఫ్రెండ్స్‌తో నవ్వుతూ చూసే మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా–‘నేను లోకల్‌’. ఇందులో బోలెడంత ప్రేమకథ, మంచి పాటలు, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉన్నాయి. వేరే హీరోలు ఇలాంటి సినిమాలు చేశారు. నేను చేయలేదు. నాకు డిఫరెంట్‌ సినిమా ఇది.



► నా చిన్ని చిన్ని కోరికలను సినిమాల్లో తీర్చుకుంటున్నా. ఓసారి లెక్చరర్‌ అయితే ఎలా ఉంటుందనే కోరికను ‘మజ్ను’తో తీర్చుకున్నా. విలన్‌గా ‘జెంటిల్‌మన్‌’లో చూసుకున్నా. మళ్లీ స్టూడెంట్‌ అయితే? ఎలా ఉంటుందనుకునే టైమ్‌లో ‘నేను లోకల్‌’ వచ్చింది. ఇందులో బీటెక్‌ స్టూడెంట్‌ బాబుగాడిగా నటించా. ఏం అనిపిస్తే అది మాట్లాడేసే టైపు. వాడి ఫ్యామిలీ ప్రవర్తన కూడా విచిత్రమే. ఈ క్యారెక్టర్స్‌ వల్ల మంచి కామెడీ క్రియేట్‌ అయింది.



► లైఫ్‌లో మన ఎక్స్‌పీరియన్స్‌ నుంచే పాత్రలు వస్తాయి. నేను ఏ పాత్ర చేసినా ప్రత్యేకంగా హోమ్‌వర్క్‌ చేయను. నాకలాంటి సందర్భం ఎదురైతే ఏం చేస్తానో ఊహించి, నటిస్తా. ఈ సినిమా విషయానికి వస్తే... నేనే లోకల్‌. నేను పెరిగిదంతా అమీర్‌పేట్, బల్కంపేట్‌ ఏరియాల్లోనే.



►  ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, సచిన్‌ ఖేడేకర్, కీర్తీ సురేశ్‌... మంచి టైమింగ్‌ ఉన్న ఆర్టిస్టులు ఉండడంతో సెట్స్‌లో దిద్దిన మెరుగులు బాగా వర్కౌట్‌ అయ్యాయి. ఇలాంటి కామెడీ సినిమాలకు సెట్స్‌లో జరిగే చిన్న చిన్న మ్యాజిక్స్‌ ప్రేక్షకులకి భలే కనెక్ట్‌ అవుతాయి. ‘అష్టా చమ్మా’, ‘అలా మొదలైంది’, ‘భలే భలే మగాడివోయ్‌’లకు అదే జరిగింది. త్రినాథరావు దర్శకత్వం, ప్రసన్న మాటలూ బాగా కుదిరాయి. దేవిశ్రీ ప్రసాద్‌ మంచి పాటలు ఇచ్చాడు.



► ఈ సినిమాని హైదరాబాద్‌లో మెయిన్‌ థియేటర్‌లో చూడాలనుకున్నా. కానీ, శివ నిర్వాణ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా కోసం అమెరికా వెళ్తున్నా. ఫిబ్రవరి 2న అక్కడ ప్రీమియర్స్‌కి హాజరవుతా.



► సెట్‌లో మిమ్మల్ని ఎవరైనా ‘బాబు’ అంటుంటారా? అనడిగితే – సాధారణంగా హీరో కుమారులు చిన్నప్పుడు సెట్‌కి వస్తే బాబు అనేవారు. తర్వాత వాళ్లు హీరోలయ్యారు. నేనలా లేను కదా! ఒకవేళ ఎవరైనా నన్ను ‘బాబు’ అని పిలిస్తే వద్దని చెబుతా. ఆ పిలుపు ఆపేవరకూ టార్చర్‌ చేస్తా. నా దృష్టిలో ఎలాంటి సినీ నేపథ్యం లేకపోవడమూ ఓ లక్‌. ‘నేను మీ ఫ్యాన్‌’ అని ప్రేక్షకులెవరైనా వస్తే చాలా హ్యాపీ. ఎందుకంటే... వాడు నా ఫ్యానే.



► మలయాళ చిత్ర పరిశ్రమలో లైట్‌బాయ్‌ నుండి మోహన్‌లాల్‌ వరకూ అందరూ ఓ లైన్‌లో కూర్చుని భోంచేస్తారు. తెలుగులో స్టార్స్‌కి ఎక్ట్స్రా ట్రీట్‌మెంట్‌ ఉంటుంది. త్వరలో ఆ పద్ధతి మారుతుంది. ‘మనందరి కంటే సినిమా గొప్పది’ అని బాపుగారి దగ్గర సహాయ దర్శకుడిగా చేస్తున్నప్పుడు తెలుసుకున్నా. జీవితాంతం అదే పాటిస్తా.



► నేనింకా చిన్న పిల్లాణ్ణే అనుకుంటున్నాను. అలాంటిది త్వరలో తండ్రి కాబోతున్నా. ఈ ఫీలింగ్‌ని మాటల్లో వర్ణించలేను. అంజనా (నాని భార్య)కి ఏప్రిల్‌ రెండో వారంలో డెలివరీ అని డాక్టర్లు చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top