'లెజెండ్'కు 9అవార్డులు వస్తాయని నిరూపిస్తారా!

Nagendra speaks on Nandi awards row - Sakshi

మెగా హీరోలు అవార్డులు అడగలేదు

బోయపాటి శీనుకు బీఎన్ రెడ్డి గురించి ఏం తెలుసు

మహానటుడు ఏఎన్నార్‌ను అవమానించారు

సాక్షి, హైదరాబాద్ : హింసాత్మక ప్రవృత్తితో కూడిన మూవీలు చేసే దర్శకుడు బోయపాటి శీనుకు బీఎన్ రెడ్డి అవార్డు ఇవ్వడం దారుణమని చిరంజీవి రాష్ట్ర యువత అధికార ప్రతినిధి నాగేంద్ర అన్నారు. సుప్రసిద్ధ వ్యక్తి బీఎన్ రెడ్డి ఎన్నో విలువలతో కూడిన సినిమాలు తీశారు. ఇక్కడ బోయపాటికి బీఎన్ రెడ్డి గురించి తెలుసా. బోయపాటి ఏం చేశారని, ఆయన సినిమాలలో ఏం చూపించారని బీఎన్ రెడ్డి అవార్డు ఇచ్చారంటూ ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల వివాదంపై ఆయన మాట్లాడారు. 'మెగా హీరోలకు, వారి సినిమాలకు అవార్డులు ఇవ్వలేదని మేం చెప్పడం లేదు. అవార్డులు కావాలని అడగలేదు. కానీ, అసలు లెజెండ్ సినిమాకు తొమ్మిది అవార్డులు వస్తాయని ఎవరైనా నిరూపించగలరా. ప్రజా క్షేత్రంలోకి వచ్చి ఒపినియన్ పోల్ లాంటిది పెడితే.. ఆ సినిమాకు ఎన్ని అవార్డులొస్తాయన్న వాస్తవం బయటపడుతుంది.

మనం సినిమా ఎంతో మంచి మూవీ. అందులో ఎన్నో విలువలున్నాయి. ఉత్తమ చిత్రం సహా పలు విభాగాల్లో అవార్డులు రావాల్సిన మనం మూవీకి కేవలం 'ద్వితీయ ఉత్తమ చిత్రం' అవార్డుతోనే సరిపెట్టారు. చివరిశ్వాస ఉన్నంతవరకూ నటిస్తానని చెప్పిన మహానటుడి చివరి చిత్రం 'మనం'. మనం చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు ఇవ్వకపోవడం మహానటుడు ఏఎన్నార్ ను అవమానించడమే అవుతుంది. రుద్రమదేవి కోసం నటి అనుష్క ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. తెలుగువాడి చరిత్రను తెలియజెప్పే ఆ మూవీకి సరైన గుర్తింపు దక్కలేదు. 'రుద్రమదేవి'లో నటనకుగానూ ఉత్తమ నటి అవార్డు అందుకోవాల్సిన అనుష్కకు 'సైజ్ జీరో'కు గానూ ఇవ్వడంలో అర్థం లేదు. ఎన్నో మంచి చిత్రాలు తీసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు బీఎన్‌రెడ్డి పురస్కారం ఇచ్చారు. ఎందుకంటే ఆయన మూవీలకూ సరైన గుర్తింపు ఇవ్వకపోవడమే అందుకు ప్రధాన కారణమని' నాగేంద్ర అభిప్రాయపడ్డారు.

మరోవైపు గుణశేఖర్, నిర్మాత నల్లమలుపు బుజ్జి కూడా అవార్డులపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. స్టార్ హీరోకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డు ఇవ్వడం అల్లు అర్జున్‌ను అవమానించమేనని గుణశేఖర్ పేర్కొన్నారు. 'అవార్డుల ఎంపికలో అవకతవకలను ప్రశ్నిస్తే మూడేళ్లు నిషేధిస్తారట. ఏపిలో గుత్తాధిపత్యం నడుస్తోందంటూ' ఆవేదన వ్యక్తం చేశారు. 'నంది అవార్డుల ఎంపికలో ఒక వర్గానికి అనుకూలంగా లాబీయింగ్ జరిగింది. ఉత్తమ నటుడు అవార్డును ప్రభాస్ కు ఎందుకివ్వలేదు..? రుద్రమదేవి సినిమాకు ఎందుకు అన్యాయం చేశారని' నిర్మాత బుజ్జి ప్రశ్నించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top