‘ఛలో’ మూవీ రివ్యూ

Chalo - Sakshi

టైటిల్‌ : ఛలో
జానర్‌ : కామెడీ ఎంటర్‌టైనర్‌
నటీనటులు : నాగశౌర్య, రష్మిక మందాన, నరేశ్‌, గిరిబాబు, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం : మహతి స్వర సాగర్‌ 
బ్యానర్‌ : ఐరా క్రియేషన్స్‌
నిర్మాత : ఉషా మూల్పూరి 
దర్శకుడు : వెంకీ కుడుముల

ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, కళ్యాణవైభోగమే, జ్యో అచ్యుతానంద లాంటి క్లాస్‌ హిట్స్‌తో మెప్పించాడు నాగశౌర్య. మధ్యలో మాస్‌ హీరోయిజం కోసం ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. తిరిగి తన స్టైల్‌లో మాంచి లవ్‌ ఎంటర్‌టైనర్‌గా చేసిన  ఛలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సారిగా తన సొంత బ్యానర్‌ను తన సినిమాతోనే ప్రారంభించారు. మరి సినిమా ఏ మేరకు అలరించిందో చూద్దాం. 

కథ :
హరి( నాగశౌర్య )కి చిన్నతనం నుంచీ గొడవలంటే ఇష్టం. ఆ గొడవల్లో తనకు దెబ్బలు తగిలినా సరే ఆనందిస్తూనే ఉంటాడు. మొత్తానికి ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటాడు. చిన్నప్పుడు హరి ఏడుపు ఆపడం లేదనీ, హరి నాన్న( నరేశ్‌ ) అందర్నీ కొట్టు కొట్టు అని చూపిస్తూ..కొడుతూ ఉంటే హరి నవ్వుతూ ఉంటాడు. అలా మొదలైన నవ్వు స్కూల్లో, వీధుల్లో కొనసాగిస్తూనే ఉంటాడు. ఇది చివరికి నరేశ్‌కి తలనొప్పిగా మారుతుంది. తన కొడుకు గొడవలకు దూరంగా ఉండాలంటే గొడవలు ఎక్కువగా జరిగే ప్రాంతంలో పెడితే మారతాడని అనుకుంటాడు. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లో తిరుప్పురు అనే గ్రామంలో  నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి.ఆంధ్ర రాష్ట్రం విడిపోయేప్పుడు తిరుప్పురు ఊరు మధ్యలోంచి సరిహద్దు వెళ్తుంది. మొదటగా సరిహద్దు గీయడానికి ఊరి పెద్దలు ఒప్పుకోరు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ఊరు తమిళ, తెలుగు భాగాలుగా విడిపోతుంది. అప్పటి నుంచీ ఆ ఊరిలో అటు వైపు వారు ఇటు రారు. ఇటువైపు వారు అటు పోరు. అలాంటి ప్రాంతంలో హరిని ఉంచితే మారతాడని అక్కడి కాలేజీలో జాయిన్‌ చేస్తాడు. ఆ కాలేజ్‌లోనే కార్తీక(రష్మిక మందాన)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు హరి. అసలు ఆ కార్తీకకు ఊరికి సంబంధం ఏంటీ? ఆ ఊరి సమస్య హరి ప్రేమకు ఏమైనా అడ్డు తగిలిందా ? తన ప్రేమను కాపాడుకోవడానికి హరి చేసిని ప్రయత్నం ఏంటి? గొడవలంటే ఇష్టమున్న హరి తన ప్రేమకోసం ఊరిని ఒక్కటి చేస్తాడా? అసలు చివరకు ఏమైందో తెలియాలంటే థియేటర్‌కు ‘ఛలో’ అనాల్సిందే.

నటీనటులు : 
నాగశౌర్య సహజంగా నటించాడు. చాక్లెట్‌ బాయ్‌లా కనిపిస్తూ.. అమ్మాయిల మనసు కొల్లగొట్టేస్తాడు. హీరోయిన్‌గా నటించిన రష్మిక పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంది. తెలుగులో తొలి సినిమానే అయినా తన నటన, క్యూట్‌ లుక్స్‌తో అలరించింది. తొందరగానే తెలుగులో మరిన్ని అవకాశాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది. తండ్రి పాత్రలో సీనియర్‌ నరేశ్‌ ఒదిగిపోయాడు. ప్రగతి తల్లి పాత్రలో తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంది. కాలేజీ లెక్చరర్‌గా పోసాని, ప్రిన్సిపాల్‌గా రఘుబాబు, స్టూడెంట్స్‌గా వైవా హర్ష, శీను, సత్య ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తారు. వెన్నెల కిశోర్‌ కామెడీ సరికొత్తగా ఉంటుంది. ఊరి పెద్దలుగా తమిళనటులు జి.ఎం.కుమార్‌,  మైమి గోపి, అచ్యుత్‌ కుమార్‌ వారి పాత్రకు న్యాయం చేశారు. 

విశ్లేషణ :
వెంకీ కుడుముల దర్శకుడిగా మాత్రమే కాకుండా రచయితగా కూడా తన పెన్నులోని చమత్కారాన్ని చూపించాడు. ప్రతీ సన్నివేశంలో కామెడీ పండించాడు. థియేటర్లో నవ్వుల పువ్వులు పూస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఊరి ఫ్లాష్‌ బ్యాక్‌ గురించి హీరో తెలుసుకునేందుకు పడే పాట్లు, ముక్కలు ముక్కలుగా దాని గురించి తెలుసుకోవడం చాలా బాగుంటుంది. ద్వితియార్థంలో వచ్చే వెన్నెల కిశోర్‌ పాత్రను దర్శకుడు చాలా బాగా వినియోగించుకున్నాడు. ఆ పాత్ర ద్వారా వీలైనంత కామెడీ పండిచాడు. సరిహద్దు వివాదంగా ప్రమోట్ చేసిన ఈ సినిమాలో సీరియస్‌ నెస్‌ ఎక్స్‌పెక్ట్ చేసి వస్తే నిరాశతప్పదు. ఊరు విడిపోవడానికి గల కారణాలు, క్లైమాక్స్‌లో ఊరు కలిసిపోయే విధానం కాస్త సిల్లీగా అనిపించినా కామెడీ సినిమాగా చూస్తే ఎంజాయ్‌ చేయోచ్చు. మ్యూజిక్‌ పరంగా మణిశర్మ తనయుడిగా మహతి నిరూపించుకున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది. పాటలు వినడానికీ, చూడడానికీ బాగుంటాయి. ముఖ్యంగా చూసి చూడంగానే పాట చాలా కాలం పాటు గుర్తుండి పోతుంది. సాయి శ్రీరామ్‌ తన కెమెరాతో  నాగశౌర్య, రష్మికలను అందంగా చూపించాడు. సెకండాఫ్ హాఫ్ లెంగ్త్‌ కాస్త ఇబ్బంది పెడుతుంది.

ప్లస్‌ పాయింట్స్‌ : 
నాగశౌర్య నటన
రష్మిక నటన, అందం
కామెడీ
                   
మైనస్‌ పాయింట్స్‌ : 
ఎక్కడా సీరియస్‌నెస్‌ కనపడకపోవడం
సెకండాఫ్‌ నిడివి

ముగింపు : హాయిగా నవ్వుకోవాలంటే సినిమాకి చల్‌ ‘ఛలో’....

బండ కళ్యాణ్‌, ఇంటర్నెట్‌ డెస్క్‌

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top