తెలుగు  సినిమాకి దక్కిన గౌరవం : విష్ణు | MOU Between New Jersey And Telugu Film Producers Guild | Sakshi
Sakshi News home page

తెలుగు  సినిమాకి దక్కిన గౌరవం : విష్ణు

Sep 18 2019 4:29 AM | Updated on Sep 18 2019 4:46 AM

MOU Between New Jersey And Telugu Film Producers Guild - Sakshi

న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీతో విష్ణు, విరోనికా 

తెలుగు సినీ పరిశ్రమ మరో మైలురాయిని అధిగమించింది. అమెరికాలోని న్యూజెర్సీలో షూటింగ్‌లు జరుపుకొనేందుకు తెలుగు ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌కి ఆ రాష్ట్రంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఫలితంగా ఇకపై న్యూజెర్సీలో చిత్రీకరణ జరుపుకొనే సినిమాలకు ఆ ప్రభుత్వం సినీ సాంకేతికత సాయం, ఫిల్మ్‌ కోర్సుల అధ్యయనానికి తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేక రాయితీలను కల్పిస్తుంది. షూటింగ్‌లపై రాయితీలు కల్పించడం వల్ల అక్కడ షూటింగ్‌ జరుపుకునే సినిమాల సంఖ్య పెరుగుతుంది. ‘‘దీనివల్ల రెండు ప్రాంతాల మధ్య పర్యాటక, సాంస్కృతిక సంబంధాలు బలపడతాయి. నాకు చిన్నప్పటి నుంచి నాటకాలు, సినిమాలంటే చాలా ఇష్టం. స్కూల్‌ రోజుల్లో అనేక నాటకాల్లో పాల్గొన్నాను’’ అని న్యూజెర్సీ గవర్నర్‌ ఫిల్‌ మర్ఫీ అన్నారు. మంచు విష్ణు మాట్లాడుతూ – ‘‘న్యూజెర్సీ ప్రభుత్వం తెలుగు ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌తో  ఒప్పందం చేసుకోవడం తెలుగు సినిమాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ప్రపంచంలో చాలా దేశాలున్నాయి.

మన దేశంలో పదుల సంఖ్యలో సినీ పరిశ్రమలు ఉన్నా.. న్యూజెర్సీ వాళ్లు మనతోనే ఒప్పందానికి రావడం తెలుగు సినిమాకు దక్కిన గుర్తింపు. ఇది తెలుగువారంతా గర్వపడాల్సిన విషయం. ఉమ్మడి ఏపీకి చెన్నారెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చేందుకు ఆయన ఎన్ని రాయితీలు కల్పించారో మనందరికీ తెలుసు. స్టూడియోలకు భూములివ్వడం, రాయితీలు కల్పించడం తదితర ప్యాకేజీల వల్ల తెలుగు పరిశ్రమ ఈ స్థాయికి చేరింది. ఇప్పుడు తిరిగి అలాంటి అవకాశం న్యూజెర్సీ ప్రభుత్వం కల్పించడం  మరో చారిత్రక అడుగు. సదుపాయాలు అందరూ ఇస్తారు.. కానీ ప్రోత్సాహకాలు కొందరే ఇస్తారు. అలాంటి చొరవ ఉంటే పరిశ్రమ వృద్ధి చెందుతుంది’’ అన్నారు. అనంతరం తెలుగు ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తరఫున నటి సుప్రియ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు సతీమణి విరోనికా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement