ధృవకు సీక్వెల్‌.. ఇద్దరితో జోడీ కడుతున్న హీరో!

Mohan Raja, Jayam Ravi to do Thani Oruvan 2 - Sakshi

సాక్షి, తమిళ సినిమా: కోలీవుడ్‌లో ఇప్పుడు సీక్వెల్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. 2.ఓ (రోబో-2), సామీ స్క్వేర్, సండైకోళీ 2 (పందెం కోడి-2) వంటి చిత్రాలు నిర్మాణంలో ఉండగా త్వరలో కమలహాసన్‌ హీరోగా ఇండియన్‌ 2, ధనుష్‌ హీరోగా మారి 2 తదితర చిత్రాలు తెరకెక్కడానికి రెడీ అవుతున్నాయి. ఈ వరుసలో తాజాగా తనీఒరువన్‌ 2 (తెలుగులో ధృవ) చేరుతోంది. జయంరవి కథానాయకుడిగా ఆయన సోదరుడు మోహన్‌రాజా దర్వకత్వంలో తెరకెక్కిన ‘తనీఒరువన్‌’  2015లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో జయం రవికి నయనతార జోడీ కట్టగా.. మోడ్రన్‌ విలన్‌గా అరవిందస్వామి రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. అప్పటివరకూ రీమేక్‌ చిత్రాల దర్శకుడన్న ముద్ర మోస్తున్న మోహన్‌రాజా తనీఒరువన్‌తో దానిని బ్రేక్‌ చేశారు.

ఈ సంచలన చిత్రానికిప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తనీఒరువన్‌ చిత్రానికి ప్రధాన మూలస్తంభాలు నలుగురు అని చెప్పవచ్చు. వారు హీరో జయంరవి, విలన్‌ అరవిందస్వామి, హీరోయిన్‌ నయనతార, దర్శకుడు మోహన్‌రాజా. ఈ నలుగురిలో ముగ్గురు తనీఒరవన్‌ సీక్వెల్‌లోనూ కనిపింపచనున్నారు. సీక్వెల్‌లోనూ నయనతార మరోసారి జయంరవితో రొమాన్స్‌ చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారట. బిజీ షెడ్యూల్లోనూ మళ్లీ జయంరవికి నయన్‌ ఓకే చెప్పడం విశేషమే. తొలి పార్టులో జయంరవి పోలీస్‌ అధికారిగా, నయనతార ఫోరెన్సిక్‌ నిపుణురాలుగానూ నటించగా.. రెండో పార్టులోనూ వీరు అదే పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. అదనంగా సీక్వెల్‌లో మరో బ్యూటీ సాయోషా సైగల్‌ కూడా చేరనుందట. జయంరవికి జోడీగా ‘వనమగన్‌’ చిత్రంతో ఈ అమ్మడు కోలీవుడ్‌కు దిగుమతి అయిన తెలిసిందే. ఇప్పుడు తనీఒరువన్‌ సీక్వెల్‌లో మరోసారి ఆయనతో జోడీ కట్టబోతోంది. ఇప్పటికే సూర్యకు జంటగా కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో నటిస్తున్న సాయేషాసైగల్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

తనీఒరువన్‌లో విలన్‌గా అరవిందస్వామి ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సీక్వెల్‌లో ఆయన పాత్ర ఎవరు పోషిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. హీరోకు దీటైన విలన్‌గా అరవింద్‌ స్వామి అద్భుతమైన అభినయం కనబర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనీఒరువన్‌- 2లో హీరో, విలన్‌ పాత్రలను ద్విపాత్రాభినయంతో జయంరవి పోషించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top