
హీరోయిన్.. డైరెక్టర్ ఒక్కటయ్యారు!
మణిరత్నం - సుహాసిని, కృష్ణవంశీ - రమ్యకృష్ణ.. ఇలా దర్శకులు హీరోయిన్లను పెళ్లి చేసుకోవడం కొత్త కాదు. ఈ కోవలోకే ఇప్పుడు మళయాళ హీరోయిన్, దర్శకుడు చేరారు. మళయాళ నటి గౌతమీ నాయర్‌ను దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్ పెళ్లి చేసుకున్నారు.
మణిరత్నం - సుహాసిని, కృష్ణవంశీ - రమ్యకృష్ణ.. ఇలా దర్శకులు హీరోయిన్లను పెళ్లి చేసుకోవడం కొత్త కాదు. ఈ కోవలోకే ఇప్పుడు మళయాళ హీరోయిన్, దర్శకుడు చేరారు. మళయాళ నటి గౌతమీ నాయర్‌ను దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్ పెళ్లి చేసుకున్నారు. ఆమె స్వగ్రామమైన అళప్పుళలో ఈ వివాహం జరిగింది. గౌతమి మొట్టమొదట హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన 'సెకండ్ షో' సినిమాకు రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. ఇదే సినిమాలో మళయాళ అగ్రనటుడు మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ కూడా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత గౌతమి నటించిన డైమండ్ నక్లెస్ సినిమాలో ఆమె పాత్రకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. ఫహాద్ ఫాసిల్ హీరోగా చేసిన ఆ సినిమాలో ఆమె దుబాయ్‌లో పనిచేసే తమిళ నర్సు పాత్ర పోషించింది.
ఇంకా క్యాంపస్ డైరీస్, కూతర, చాప్టర్స్ లాంటి అనేక సినిమాల్లో గౌతమీ నాయర్ నటించింది. చాలా కాలంగా దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్‌తో ప్రేమలో ఉన్నా, ఆ విషయం గురించి ఇన్నాళ్లుగా ఇద్దరిలో ఎవరూ బయటపడలేదు. ఏప్రిల్ మొదటి వారంలో తన పెళ్లి విషయం చెబుతానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో గౌతమి తెలిపింది. పెళ్లి తర్వాత కూడా తన జీవితం దాదాపు ఇలాగే ఉంటుందని, తన చదువులు కొనసాగుతాయని చెప్పింది. మంచి పాత్రలు ఏమైనా దొరికితే సినిమాలు కూడా చేస్తానంది. పరిశ్రమకు పూర్తిగా దూరం కావడం మాత్రం తన వల్ల కాని పని అని స్పష్టం చేసింది. ఇప్పుడు దర్శకుడిని పెళ్లాడి గృహిణి పాత్రలోకి వెళ్లింది.