హీరోయిన్ మీరా వాసుదేవన్ (Meera Vasudevan) మరోసారి విడాకులు తీసుకుంది. ఈమె గతేడాది మూడో పెళ్లి చేసుకుంది. కెమెరామెన్ విపిన్ పుత్యాంగంతో ఏడడుగులు వేసింది. అయితే ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. భేదాభిప్రాయాలతో ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఓ పోస్ట్ పెట్టింది. 'నేను మీరా వాసుదేవన్.. 2025 ఆగస్టు నుంచి సింగిల్‌గానే ఉంటున్నాను. ప్రస్తుతం నేను చాలా అందమైన, ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను' అని రాసుకొచ్చింది. తన పెళ్లి ఫోటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది.
పర్సనల్ లైఫ్
మీరా వాసుదేవన్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్‌ను 2005లో పెళ్లి చేసుకుంది. మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. దీంతో ఐదేళ్లకే విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్‌ను పెళ్లాడింది. వీరి దాంపత్యానికి గుర్తుగా బాబు పుట్టాడు. కొన్నాళ్లకు ఈ జంట కూడా విడిపోయింది.
2016లో విడాకులు తీసుకున్నారు. కుడుంబవిలక్కు సీరియల్ షూటింగ్‌లో కెమెరామెన్ విపిన్‌తో లవ్‌లో పడింది. కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డారు. ఈ క్రమంలో 2024 మేలో కోయంబత్తూరు వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కానీ, ఈ మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
సినిమా
మీరా వాసుదేవన్ 2001లో సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా పరిచయమైంది. గోల్‌మాల్ అనే తెలుగు చిత్రంతో వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అంజలి ఐ లవ్యూ అనే సినిమాలోనూ యాక్ట్ చేసింది. మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలు చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.
చదవండి: ఇమ్మూతో తనూజ పంచాయితీ... ఇలాగైతే టైటిల్ గెలవడం కష్టమే!


