వరుణ్‌ సందేశ్‌ను క్షమాపణ కోరిన మహేష్‌

Mahesh Vitta Says Sorry To Varun Sandesh In Bigg Boss 3 Telugu - Sakshi

వరుణ్‌ సందేశ్‌-మహేష్‌ మధ్య జరిగిన గొడవను సర్దిచెప్పేందుకు ఇంటి సభ్యులందరూ ప్రయత్నించారు. మహేష్‌ సైతం క్షమాపణ చెబుతానని తెలిపాడు. అయితే అందరూ కలిసి చర్చించేందుకు లివింగ్‌ రూమ్‌కు వచ్చాక మళ్లీ తారాస్థాయికి చేరింది. తాను ఏం చెప్పదలుచుకున్నానో అది బాబా భాస్కర్‌కు చెప్పానని, ఆయన అందరికీ అర్థమయ్యేలా చెపుతాడని మహేష్‌ అన్నాడు. దీంతో వరుణ్‌ సందేశ్‌ బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ వితికా వెళ్లి వరుణ్‌ను తీసుకొచ్చాక.. తాను కూడా శ్రీముఖికి అంతా వివరించానని తను చెప్పవల్సింది శ్రీముఖి చెబుతుందని వరుణ్‌ సందేశ్‌ కౌంటర్‌ విసిరాడు. ఇలా పెరుగుకుంటూ వెళ్తూ ఉన్న గొడవను ఇంటి సభ్యులందరూ కలిసి తగ్గించే ప్రయత్నం చేశారు. చివరకు తన తప్పులేకపోయినా.. సారీ చెబుతున్నానని అన్న తరువాత.. అలాంటి క్షమాపణ తనకు వద్దని వితికా తెలిపింది. ఆ తరువాత వితికాను వెళ్లిపోండి అని మహేష్‌ అనడంతో మళ్లీ గొడవ మొదలైంది. ‘ఆ విషయం మీరెలా చెబుతారు? నా ఇష్టం ఎక్కడైనా ఉంటా చెప్పడానికి మీరెవరు’ అంటూ మహేష్‌పై ఫైర్‌ అయింది. మళ్లీ గొడవ మొదటికొచ్చింది. 

ఇక వరుణ్‌ అందుకుని.. హౌస్‌లో సరిగా ఉండడని, టైమ్‌కు లేవడని, మధ్యాహ్నం పడుకుంటాడని మహేష్‌పై అసందర్భపు ఆరోపణలు చేశాడు. ఈ గొడవలో మళ్లీ శ్రీముఖిపై మహేష్‌ అరిచాడు. హిమజ కల్పించుకుని.. అంతా బాగానే చేశావు మళ్లీ చివర్లో ‘వెళ్లిపోండి’ అని అనడంతో మళ్లీ గొడవ మొదలైందని మహేష్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. ముందునుంచీ బాబా భాస్కర్‌ ఈ గొడవను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. భార్య విషయంలో ఎవరైనా అలాగే రియాక్ట్‌ అవుతారని మహేష్‌ తనతో చెప్పాడని.. ఒక్కసారి వెళ్లు సారీ చెబుతాడంటా అని వరుణ్‌ సందేశ్‌ను బుజ్జగించే ప్రయత్నం చేశాడు బాబా భాస్కర్‌. ఆ ప్లేస్‌లో తానుంటే ఇంకా ఎక్కువ రియాక్ట్‌ అయ్యేవాడిని అంటూ వరుణ్‌ సందేశ్‌ను హగ్‌చేసుకుని సారీ చెప్పాడు మహేష్‌. ఇక ఇదే విషయాన్ని ఉదయం శివజ్యోతికి చెబుతూ.. వాళ్లిద్దరికి సారీ చెప్పిన తరువాతే నిద్ర పట్టిందని మహేష్‌ అన్నాడు.

డైనింగ్‌ టేబుల్‌ వద్ద గొడవ
శ్రీముఖి అతి మంచితనం ప్రదర్శిస్తూ.. బాబా భాస్కర్‌ ఉదయం నుంచి తినలేదని, ఈరోజు ఎగ్‌ తినడని, ఇంట్లో పండ్లు కూడా లేవని, ఇంకా బ్రష్‌ కూడా వేయలేదని, స్నానానికి వెళ్లాడని ఇలా ఓ పురాణం చెప్పుకుంటూ ఉండగా.. రాహుల్‌, వరుణ్‌ సందేశ్‌ ఫైర్‌ అయ్యారు. మధ్యలో హేమ కల్పించుకుంటూ.. ఈ చిన్న విషయానికి ఎందుకు అరుస్తున్నారని, కిచెన్‌లో ఉండే వారికి కొన్ని హక్కులు ఉంటాయని, అన్నీ అందరికీ వివరించాల్సిన పని లేదని, బాబా భాస్కర్‌కు కొంచెం ఫుడ్‌ ఉంచండని సూటిగా చెప్పు, అదంతా చెప్పాల్సిన పని లేదని శ్రీముఖికి హితవు పలికింది. అంత ఎక్కువగా విడమరిచి చెప్పకుండా.. బాబా భాస్కర్‌కు ఫుడ్‌ ఉంచడని చెబితే సరిపోతుందని సావిత్రి, హిమజలు శ్రీముఖికి సూచించారు.

రెండు టీమ్‌లుగా విడిపోయిన ఇంటిసభ్యులు
ఓ టాస్క్‌లో భాగంగా ఇంటిసభ్యులను రెండు టీమ్‌లుగా బిగ్‌బాస్‌ విడగొట్టాడు. ఆర్ట్స్‌ స్కూల్‌గా విభజించి ఒకదానికి శ్రీముఖిని, మరొక దానికి బాబా భాస్కర్‌ను లీడర్‌గా నియమించాడు. వీరంతా మంచి కాన్సెప్ట్స్‌తో ఆడుతూ, పాడుతూ బిగ్‌బాస్‌ను ఎంటర్‌టైన్‌ చేయవల్సిందిగా ఆదేశించాడు. ఈ రిహార్సల్స్‌లో బాబా భాస్కర్‌, జాఫర్‌లు చేసిన కామెడీ హైలెట్‌గా నిలిచింది. దీనిపై రిలీజ్‌ చేసిన ప్రోమో కూడా బాగా వైరల్‌ అయింది. ఇంట్లో సభ్యులు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియజేస్తూ.. వారిద్దరూ కలిసి చేసిన స్కిట్‌ బాగుంది. దాంట్లో భాగంగానే బాబా భాస్కర్‌.. జాఫర్‌ను రా అని పిలవడం.. ఆయన సీరియస్‌ కావడం అంతా నాటకమే. 

శ్రీముఖి టీమ్‌ చేసిన స్కిట్‌ ఫన్నీగా, సో సోగా ఉండగా.. బాబా భాస్కర్‌ టీమ్‌ చేసిన స్కిట్‌ కాస్త ఎమోషనల్‌ టచ్‌గా అనిపిస్తుంది. ఓ కోట, గైడ్‌, రెండు జంటలు, దొంగతనం అంటూ ఏదో చేయడానికి శ్రీముఖి టీమ్‌ ప్రయత్నించగా.. రైతు, భూమి అంటూ ఓ మంచి కాన్సెప్ట్‌ ఎంచుకుని బాబా భాస్కర్‌ టీమ్‌ ఆలోచించేలా చేశారు. ఇక చివరకు శ్రీముఖి, రాహుల్‌ మాట్లాడుకుంటూ.. మధ్యాహ్నం డైనింగ్‌ టేబుల్‌ వద్ద జరిగిన గొడవ గురించి ప్రస్థావించుకున్నారు. మొత్తానికి ఈ రోజూ గొడవలతో పాటు కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ లభించింది. ఇక రేపు కింగ్‌ నాగార్జున వచ్చి ఎవరికి ఎలా క్లాస్‌ పీకుతారో చూడాలి. ఎలిమినేషన్‌ను తప్పించుకుని ఎవరు సేఫ్‌జోన్‌లో ఉన్నారో రేపు ప్రకటించే అవకాశం ఉంది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top