విశాల్‌ వర్గానికి షాక్‌

Madras High Court Judgement on Nadigar Committee Elections - Sakshi

నడిగర్‌ సంఘం ఎన్నికలు చెల్లవు

హైకోర్టు సంచలన తీర్పు

అయోమయంలో విశాల్‌ వర్గం

తమిళనాడు,పెరంబూరు: నటుడు విశాల్, నాజర్, కార్తీ వర్గానికి చెన్నై హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ సంఘానికి గత ఏడాది జూన్‌లో జరిగిన ఎన్నికలు చెల్లవంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. గత ఏడాది జూన్‌ 23వ తేదీన నడిగర్‌ సంఘం (దక్షిణ భారత నటీనటుల సంఘం)కు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నాజర్‌ అధ్యక్షతన పాండవర్‌ పేరుతో ఒక జట్టు, దర్శక, నటుడు కే.భాగ్యరాజ్‌ అధ్యక్షతన స్వామి శంకరదాస్‌ పేరుతో ఒక జట్టు పోటీ చేశాయి. ఎన్నికలు జరిగినా ఓట్ల లెక్కింపు చేపట్ట లేదు. కారణం తమకు ఓటు హక్కును రద్దు చేయడంతో ఎన్నికలను బహిష్కరించాలని సంఘ సభ్యులు బెంజిమెన్, ఏలుమలై మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సంఘ నిర్వాకంలో పలు అవకతవకలు జరిగాయని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికల గడువు పూర్తయిన ఆరు నెలల తరువాత నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపును నిలిపి వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాండవర్‌ జట్టుకు చెందిన నాజర్, విశాల్, కార్తీ తదితరులు సంఘం ఎన్నికలు సక్రమంగానే జరిగాయని, సంఘం నుంచి అర్హత లేని సభ్యులనే తొలగించామని, కాబట్టి ఓట్ల లెక్కింపునకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ రిట్‌ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు.

ఎన్నికల వ్యవహారం కోర్టులో ఉండడంతో ప్రభుత్వం సంఘ నిర్వహణ బాధ్యతల కోసం ప్రత్యేక అధికారిని నియమించింది. ఆ అధికారి నియమాకాన్ని వ్యతిరేకిస్తూ విశాల్‌ వర్గం  కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇలా ఎన్నికలపై నమోదైన పిటిషన్లపై పలు దఫాలుగా కోర్టు విచారణ జరిపింది. అన్ని పిటిషన్లపై తీర్పును శుక్రవారం వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి కల్యాణ సుందరం గురువారం ప్రకటించారు. శుక్రవారం న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. అందులో ఇంతకు ముందు జరిగిన సంఘం ఎన్నికలు చెల్లవని, సంఘ నిర్వాకం గడువు పూర్తి అయిన తరువాత ఎన్నికలు నిర్వహించడం చట్ట విరుద్ధమని తెలిపారు. సంఘానికి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఆదీ మూడు నెలల్లో నిర్వహించాలని ఆదేశించింది. సంఘం సభ్యుల పట్టికను కొత్తగా తయారు చేయాలని, ఎన్నికల పర్యవేక్షణకు పూర్వ న్యాయమూర్తి గోకుల్‌దాస్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. అప్పటి వరకూ ఎన్నికల అధకారిణిగా గీతనే సంఘం బాధ్యతలను నిర్వహిస్తారని న్యాయస్థానం పేర్కొంది. కాగా హైకోర్టు తీర్పు నాజర్‌ వర్గానికి షాక్‌కు గురిచేసింది. మరి ఈ తీర్పును సవాల్‌ చేస్తూ వారు సుప్రీం కోర్టుకు వెళ్లతారా, లేక చెన్నై హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటారా? అన్నది చూడాలి.

విశాల్‌ వర్గం సుప్రీంకు వెళ్లకూడదు
మద్రాసు హైకోర్టు తీర్పు సినీ వర్గాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సంఘ మాజీ కార్యదర్శి, సంఘం నుంచి సస్పెండ్‌ అయిన  సభ్యుడు, సీనియర్‌ నటుడు రాధారవి న్యాయస్థానం తీర్పును స్వాగతించారు. ఆయన మాట్లాడుతూ సంఘం నుంచి సాధారణ సభ్యులకు ఆర్థిక సాయం అందాలన్నారు. కాబట్టి తొలగించిన సభ్యులను మళ్లీ చేర్చుకుని మళ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న తీర్పు మంచిదేనన్నారు. తనను సంఘం నుంచి తొలగించడమే తప్పు అని అన్నారు. అది చట్టప్రకారం చెల్లదని, తనను సంఘంలో ఉండకూడదని భావించి చేసిన కుట్ర అది అని అన్నారు. చెడ్డవాడు చెడునే భావిస్తాడన్నారు. విశాల్‌ మంచి వాడేనని, కాలు పెడితే కొలనులో తాబేలు మాదిరి అన్నీ తను కాలు పెట్టిన నడిగర్‌ సంఘం, నిర్మాతల సంఘం నాశనమయ్యాయన్నారు. సక్రమంగా ఉంటే మంచిగా జరిగేదన్నారు. విశాల్‌వర్గం కాల వ్యవధి దాటిన తరువాత ఎన్నికలు నిర్వహించడం పెద్ద తప్పు అని, అలాగే పలు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. సంఘ సభ్యులకు పెన్షన్లు ఆగిపోతున్నాయని చెబుతున్న విశాల్‌ వర్గం మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, సుప్రీంకోర్టుకు వెళ్లితే ఆ కేసు విచారణకు మూడేళ్లు పడుతుందని చెప్పారు. కాగా న్యాయస్థానం తీర్పును విశాల్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన నిర్మాత ఐసరి గణేశ్‌ స్వాగతించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top