నయన చిత్రానికి లైన్‌ క్లియర్‌ | Madras HC lifts stay on Nayanthara Kolayuthir Kaalam | Sakshi
Sakshi News home page

నయన చిత్రానికి లైన్‌ క్లియర్‌

Jun 30 2019 7:55 AM | Updated on Jun 30 2019 7:55 AM

Madras HC lifts stay on Nayanthara Kolayuthir Kaalam - Sakshi

నటి నయనతార చిత్ర విడుదలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. దక్షిణాదిలోనే అగ్రనటిగా వెలిగిపోతున్న నటి నయనతార. తమిళం, తెలుగు, మలయాళం భాషా చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జంటగా దర్బార్, దళపతి విజయ్‌ సరసన బిగిల్‌ చిత్రాల్లో ఒకేసారి నటిస్తున్నారు. ఇక తెలుగులో చిరంజీవితో నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేశారు. మలయాళంలో చాలా గ్యాప్‌ తరువాత నటుడు నివిన్‌పోలితో ఒక చిత్రంలో నటిస్తున్నారు.

వాటితో పాటు ఒక కొత్త దర్శకుడి హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపింది. ఇదంతా బాగానే ఉన్నా ఇటీవల ఈ అమ్మడి టైమ్‌ బాగాలేనట్లుంది. నటిగానే వ్యక్తిగతంగా కాదు. నిజజీవితంలో తన ప్రియుడు విఘ్నేశ్‌శివన్‌తో కలిసి విదేశాల్లో జాలీగా ఎంజాయ్‌ చేస్తున్నారు. నటిగా ఈ మధ్య నటించిన ఐరా, శివకార్తికేయన్‌తో నటించిన మిస్టర్‌ లోకల్‌ చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి.

ఇక ఈ సంచలన నటి నటించిన మరో లేడీ ఓరియెంటెడ్‌ హర్రర్‌ కథా చిత్రం కొలైయుధీర్‌ కాలం. నిర్మాణంలోనే జాప్యం జరిగిన ఈ చిత్రం రెండు నెలలుగా సమస్యల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతూ వచ్చింది. చక్రి తోలేటి  దర్శకత్వం వహించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో సీనియర్‌ నటుడు రాధారవి చేసిన అనుచిత వ్యాఖ్యలు నటి నయనతార మనసును గాయపరిచాయి. ఆ వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపింది.

ఆ తరువాత చిత్రం గురించి నటి నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ కొలైయుధీర్‌ కాలం చిత్రం ఆగిపోయ్యిందనుకున్నానని చేసిన వ్యాఖ్యలు చిత్ర నిర్మాతలను ఆగ్రహానికి గురిచేశాయి. ఆ తరువాత ఇరు వర్గాల మధ్య చర్చలతో సమస్య పరిష్కారం అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలు కొలైయుధీర్‌ కాలం చిత్ర విడుదల తేదీని వెల్లడించారు.

అలాంటి సమయంలో అదే పేరుతో కూడిన దివంగత ప్రముఖ రచయిత సుజాత రాసిన నవలను బాలాజీకుమార్‌ అనే వ్యక్తి రూ.10 లక్షలకు కొన్నారు. దీంతో కొలైయుధీర్‌ కాలం చిత్ర టైటిల్‌ రైట్స్‌ తనకు చెందినవని అతను మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అందులో కొలైయుధీర్‌ చిత్ర విడుదలపై నిషేధం విధించాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం చిత్రం విడుదలపై తాత్కాలిక స్టేను విధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

దీంతో నిర్మాతలు రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన న్యాయస్తానం టైటిల్‌కు కాపీరైట్స్‌ ఉండవంటూ తీర్పునిస్తూ, కొలైయుధీర్‌ కాలం చిత్ర విడుదలపై నిషేధాన్ని ఎత్తివేశారు. దీంతో చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇదే చిత్ర హిందీ వెర్శన్‌లో నయనతార పాత్రను నటి తమన్నా పోషించింది. ఖామోషి పేరుతో రూపొందిన ఆ చిత్రం ఇటీవల విడుదలై నిరాశ పరిచింది. దీంతో నయనతార నటించిన కొలైయుధీర్‌ కాలం చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నయనతారకు ఇప్పుడు ఒక హిట్‌ చాలా అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement