శ్రీదేవి గర్వపడేలా చేయాలనుకున్నా | Madhuri Dixit on taking up Sridevi's role in Kalank | Sakshi
Sakshi News home page

శ్రీదేవి గర్వపడేలా చేయాలనుకున్నా

Mar 1 2019 1:58 AM | Updated on Mar 1 2019 1:58 AM

Madhuri Dixit on taking up Sridevi's role in Kalank - Sakshi

మాధురీ దీక్షిత్‌, శ్రీదేవి

‘‘శ్రీదేవి చనిపోయి ఏడాది పూర్తయింది. కానీ శ్రీదేవి మన మధ్య లేరు అనే వాస్తవాన్ని అంగీకరించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం శ్రీదేవి చేయాల్సిన ఓ పాత్రను నేను చేయడం చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది. శ్రీదేవి గర్వపడేలా చేస్తాననే అనుకుంటున్నాను’’ అని మాధురీ దీక్షిత్‌ అన్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో సంజయ్‌ దత్, మాధురీ దీక్షిత్, ఆలియా భట్, వరుణ్‌ ధావన్, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రల్లో అభిషేక్‌ వర్మన్‌ తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘కళంక్‌’. ఇందులో మాధురి పోషిస్తున్న పాత్రను మొదట శ్రీదేవి చేయాలి. కానీ శ్రీదేవి అకాల మరణంతో ఆ పాత్ర మాధురికి వెళ్లిన సంగతి తెలిసిందే.

ఈ విషయం గురించి మాధురి మాట్లాడుతూ – ‘‘ఈ పాత్ర కోసం కరణ్‌ నన్ను సంప్రదించగానే చాలా ఎమోషనల్‌గా ఫీల్‌ అయ్యాను. శ్రీ, నేను చివరిసారిగా డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా బర్త్‌డే పార్టీలో కలుసు కున్నాం. ఆ పార్టీలో పిల్లలిద్దరితో (జాన్వీ, ఖుషీ) సంతోషంగా కనిపించింది. సడన్‌గా శ్రీదేవి చనిపోవడం బాధగా అనిపించింది. తన మరణంతో జీవితం చాలా చిన్నది అనే విషయాన్ని తెలుసుకున్నాను. ప్రతిరోజుని ఆస్వాదించాలి, ఆనందించాలి అని తెలుసుకున్నాను. ఎందుకంటే రేపు ఏమవుతుందో మనం ఎవ్వరం ఊహించలేం’’ అని అన్నారు. ‘కళంక్‌’ ఈ ఏడాది రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement