‘కృష్ణార్జున యుద్ధం’ మూవీ రివ్యూ

Krishnarjuna Yuddham Movie Review - Sakshi

టైటిల్ : కృష్ణార్జున యుద్ధం
జానర్ : యాక్షన్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : నాని, అనుపమా పరమేశ్వరన్, రుక్సర్‌ మీర్‌
సంగీతం : హిప్‌ హాప్‌ తమిళ
దర్శకత్వం : మేర్లపాక గాంధీ
నిర్మాత : సాహు గారపాటి, హరీష్‌ పెద్ది

వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాచురల్‌ స్టార్‌ నాని మరోసారి ద్విపాత్రాభినయం చేసిన  ‘కృష్ణార్జున యుద్ధం’తో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పటికే నానికి వరుసగా విజయాలు వెన్నంటి నడుస్తున్నాయి. ఇక వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ రాజా లాంటి హిట్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న మేర్లపాక గాంధీ ఈ సారి నానితో జత కట్టాడు. మరి వీరిద్దరి కలయికలో వచ్చిన కృష్ణార్జున యుద్ధం సినీ అభిమానులను ఏ మేరకు అలరించిందో చూద్దాం.

కథ
చిత్తూరు జిల్లా అక్కుర్తి గ్రామంలో ఉండే కృష్ణ (నాని) ప్రేమంటూ ఊళ్లో ప్రతీ అమ్మాయి వెనక పడుతుంటాడు. కానీ ఏ అమ్మాయి కృష్ణ ప్రేమను ఒప్పుకోదు. దీంతో ఊర్లో ఉన్న అమ్మాయిలను అసలు చూడకూడదనీ, ఇక ఎవర్నీ ప్రేమించకూడదని కృష్ణ అనుకుంటాడు. ఇలాంటి సమయంలో ఆ వూరి సర్పంచ్‌ మనమరాలు రియా( రుక్సర్‌ మీర్‌)ను చూస్తాడు. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు.

మరోవైపు ఫారెన్‌లో ఉన్న రాక్‌స్టార్‌ అర్జున్‌ (నాని)ను...  చూసిన ప్రతి అమ్మాయి అతడికి ఓకే చెబుతుంది. ఇక కృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే....అర్జున్‌ మాత్రం పెళ్లి గురించి పట్టించుకోకుండా కనబడిన అమ్మాయిలతో ఎంజాయ్‌ చేస్తాడు. అలాంటి సమయంలో అర్జున్‌... సుబ్బలక్ష్మి( అనుపమా పరమేశ్వరన్‌)ను చూస్తాడు.  (సాక్షి రివ్యూస్‌) అయితే సుబ్బలక్ష్మి మాత్రం అర్జున్‌ చేసే ప్రయత్నాలను పట్టించుకోదు.

ఇలా కథ కొనసాగుతుండగా కృష్ణ, అర్జున్‌లకు ఒకే రకమైన సమస్య ఏర్పడుతుంది. అదేం సమస్య? ఆ సమస్యలోంచి ఎలా బయటపడ్డారు? వీరిద్దరి మధ్య యుద్ధమే కృష్ణార్జున యుద్ధమా? లేక వీరిద్దరూ కలిసి చేసే యుద్ధం కృష్ణార్జున యుద్ధమా? అనేది థియేటర్లో చూడాల్సిందే.

నటీనటులు
ఊళ్లో అల్లరి చిల్లరగా తిరిగే కృష్ణ పాత్రలో నాని ఇరగ్గొట్టేశాడు. చిత్తూరు యాసలో సహజంగా ఒదిగిపోయాడు. అక్కడి కట్టు, మాటతీరుతో మాస్‌ లుక్కులోకి మారిపోయాడు. నాని, రుక్సర్‌ మీర్‌ల లవ్‌ ట్రాక్‌ ఇదే వరకే ఎన్నో సినిమాల్లో చూసినట్టు అనిపించినా...నాని నటనతో కొత్త దనాన్ని తీసుకొచ్చాడు. రుక్సర్‌ మీర్‌ తన పరిధి మేరకు ఆకట్టుకుంది. ఇక ఊర్లో నాని స్నేహితులతో నడిచిన కామెడీ ట్రాక్‌ కూడా బాగా పండింది.

రాక్‌స్టార్‌ అర్జున్‌ పాత్రకు తగ్గ యాటిట్యూడ్‌ను నాని మెయింటెన్‌ చేశాడు. తన స్నేహితుడు ఓ ప్రైవేట్‌ ఆర్గనైజేషన్‌కు సహాయం చేసేందుకు ఫ్రీగా ఒక షో చేసి పెట్టు అని అడగాడనికి వస్తే తనకేమాత్రం అలాంటి నచ్చవనీ తన పాత్ర గురించి ఓ హింట్‌ ఇస్తాడు. ఇలా రెండు పాత్రలకు తన నటనలో వైవిధ్యాన్ని చూపించాడు. అర్జున్‌ స్నేహితుడిగా బ్రహ్మాజీ కామెడి అదిరిపోయింది. అనుపమా పరమేశ్వరన్‌ పిన్ని పాత్రలో దేవదర్శిని , బ్రహ్మాజికి మధ్యలో వచ్చే కామెడీ నవ్వులు తెప్పిస్తుంది. అనుపమా క్యూట్‌ లుక్స్‌తో, తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక మిగిలిన పాత్రల్లో నాగినీడు, ప్రభాస్‌ శీను, హరితేజ లాంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.  (సాక్షి రివ్యూస్‌)

విశ్లేషణ
ద్విపాత్రాభినయం, ప్రేమ కథ, కామెడీ ఈ ఫార్మూలా టాలీవుడ్‌లో తెలిసిందే. ఇదే తరహాలో వచ్చిన కథలూ హిట్టే. మళ్లీ అదే కాన్సెప్ట్‌తో  సేఫ్‌ గేమ్‌ ఆడి మేర్లపాక గాంధీ సక్సెస్‌ సాధించాడనే చెప్పవచ్చు. తనకు కలిసి వచ్చిన కామెడీతోనే సినిమాను నడిపించాడు. కానీ గాంధీ అందించిన స్ర్కీన్‌ ప్లే మాత్రం కొత్తగా అనిపిస్తుంది. ఒకే సమయంలో కృష్ణ, అర్జున్‌ల ప్రేమకథను నడిపించడం బాగుంది. పంచ్‌ డైలాగ్‌లు బాగానే పేలాయి. ఇక ప్రేమకథలో విలన్లు ఉండాలి కదా అని ఊరికే పెద్ద పెద్ద విలన్లను పెట్టకుండా...విలన్‌ అనే కాన్సెప్ట్‌లో వారిని అంతం చేస్తూ...సమాజానికి సందేశమిచ్చేట్టుగా వారి కథను ముగించాడు.

అంటే మొత్తంగా ఇది సందేశాత్మక చిత్రమూ కాదు. కొన్ని సన్నివేశాలతో మహిళల అక్రమ రవాణా వల్ల ఎన్ని బాధలు అనుభవిస్తారో చూపించాడు. నాని సినిమాలో ఇంతకు ముందెన్నడూ లేనటువంటి భారీ యాక్షన్‌ సీన్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి. ఎడిటింగ్‌ పరంగా సినిమా బాగా వచ్చింది. సత్య తన కత్తెరకు పదును పెట్టాడని తెలుస్తోంది. కానీ సెకండాఫ్‌లో వచ్చే అనవసర సాంగ్‌ సినిమా మూడ్‌ను పక్కకు తప్పించేలా ఉంది. అది కూడా కాస్త చూసి ఉంటే ఇంకా బాగుండేది.  కార్తీక్‌ అందించిన ఛాయాగ్రహణం సినిమాను అందంగా మలిచింది. చిత్తూరు అందాలను, ఫారెన్‌ లొకేషన్లను తెరపై బాగా చూపించాడు. ఊర్లో పాడే పాటలకు , రాక్‌స్టార్‌ పాడే పాటలకు రెండింటికి తగ్గట్టుగా హిప్‌ హాప్‌ తమిళ మంచి సంగీతాన్ని అందించాడు. నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌

నాని నటన
హీరోయిన్ల నటన, అందం
కామెడీ
కథనం

మైనస్‌ పాయింట్స్‌

సెకండాఫ్‌
కొత్తదనం లోపించడం

ముగింపు : ఈ కృష్ణార్జున యుద్ధం లో నవ్వుల పువ్వులు వికసిస్తాయి.

బండ కళ్యాణ్‌, ఇంటర్నెట్‌ డెస్క్‌

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top