జయలలిత.. నేనూ సేమ్‌!

Kangana Ranaut Comments On Jayalalitha Biopic - Sakshi

తమిళసినిమా: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తనకు సారూప్యత ఉందని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ అంటున్నారు. సంచలన నటిగా తరచూ వార్తల్లో ఉండే  కంగనా చాలాకాలం తరువాత కోలీవుడ్‌లో రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. మొదట్లో జయంరవికి జంటగా ‘ధామ్‌ ధూమ్‌’ చిత్రంలో నటించిన ఈ అమ్మడు ఆ తరువాత బాలీవుడ్‌లో బిజీ అయి.. అక్కడ టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. ఇటీవల చారిత్రాత్మిక చిత్రం ‘మణికర్ణిక’లో ఝాన్సీరాణిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

త్వరలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో ఆమె నటించబోతున్నారు. ‘తలైవి’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనుంది. విజయ్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంపై ప్రారంభానికి ముందే నుంచే బోలెడంత హైప్‌ క్రియేట్‌ అయింది. కారణం జయలలిత పాత్రలో కంగనా నటించనుండటమే. ఈ చిత్రంలో ‘అమ్మ’గా మారడానికి కంగనా కూడా బగానే కష్టపడుతున్నారు. జయ పాత్ర కోసం ఇటీవల అమెరికాలో మేకప్‌ టెస్ట్‌ చేయించుకున్న ఆమె భరతనాట్యంలో శిక్షణ కూడా పొందుతున్నారు. జయలలితలా తెరమీద కనిపించేందుకు ప్రత్యేకంగా తర్ఫీదు కూడా తీసుకుంటున్నారు.

మా మధ్య స్వారూప్యం చాలానే ఉంది
ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి కోవై వచ్చిన కంగనా మీడియాతో కాసేపు ముచ్చటించారు. తాను నటిస్తున్న జయలలిత బయోపిక్‌ రెండు భాగాలుగా తెరకెక్కనుందని ఆమె తెలిపారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, యుక్త వయసులోనే సినీరంగప్రవేశం చేసిన జయలలిత.. సిని ఇండస్ట్రీలో పురుషాధిక్యతను ఎదుర్కొని పలు విజయాలను అందుకున్నారని చెప్పారు. తానూ ఆమె మాదిరేనని, కాబట్టి తమ మధ్య స్వారూప్యం చాలానే ఉందని తెలిపారు. జయలలిత విజయవంతమైన రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా చాలా శక్తిమంతమైన మహిళగా జీవించారని ప్రశంసించారు. భాషలో పరిణితి, భరతనాట్యం వంటి పలు విషయాల్లో ప్రతిభావంతురాలైన జయలలిత పాత్రలో నిజాయితీగా నటించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. అందుకోసం తమిళ భాషను కూడా నేర్చుకుంటున్నట్లు కంగనా వెల్లడించారు. రాజకీయ నేపథ్యంతో ఉన్న చిత్రాల్లో నటిస్తున్నా.. నిజజీవితంలో రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని కంగనా రనౌత్‌ స్పష్టం చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top