2026కి వెల్‌కమ్ చెప్పే క్రమంలో అందరూ 2025ను ఓసారి రివైండ్ చేసుకుంటున్నారు. అయితే ఈసారి కొంత స్పెషల్‌గా ఏకంగా పదేళ్లు వెనక్కు వెళ్లిపోతున్నారు. 2016 అంటూ దశాబ్దపు కాలం క్రితం నాటి అనుభవాలను, జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ 2016ని తన జీవితంలోనే ఎక్కువ ఇబ్బంది పెట్టిన ఏడాదిగా అభివర్ణించింది.
2016ని ఎందుకు మిస్ అవుతున్నారో?
వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అత్యంత దారుణ పరిస్థితులను చూశానంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందరూ సడన్‌గా 2016ని ఎందుకు మిస్ అవుతున్నారో? నాకైతే ఆ ఏడాది ఒక పీడకల. క్వీన్, తను వెడ్స్ మను సినిమాలతో ఘన విజయాలు అందుకుని అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నాకు 2016 జనవరిలో ఓ పెద్ద షాక్ తగిలింది. నా సహనటుడు నాకు లీగల్ నోటీసులు పంపాడు.
సంచలనం
అది ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. దానివల్లే ఇండస్ట్రీ ఇన్‌సైడర్స్, ఔట్‌సైడర్స్ అని రెండుగా చీలిపోయింది. విజయం విషపూరితమైపోయింది. జీవితం నరకప్రాయంగా మారింది. ఎన్నో న్యాయపోరాటాలు చేయాల్సి వచ్చింది. 2026లో ఇలా హ్యాపీగా ఉంటానని.. ఆ వివాదాన్ని కొంతకాలానికే అందరూ మర్చిపోతారని అప్పుడే తెలిసుంటే అంత బాధపడి ఉండేదాన్ని కాదు. ఇప్పుడు 2016లో కాకుండా 2026లో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని రాసుకొచ్చింది.
ఏమిటా వివాదం?
గతంలో కంగనా రనౌత్- హృతిక్ రోషన్ ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ ఎంతోకాలం కొనసాగలేదు. భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. ఈ క్రమంలో 2016వ సంవత్సరం ప్రారంభంలో కంగనా తన ఇంటర్వ్యూలలో హృతిక్ రోషన్‌ను ఎక్స్‌గా పేర్కొంటూ కొన్ని కామెంట్స్ చేసింది. దీంతో హృతిక్.. కంగనా తనకు క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులు పంపించాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు.
దీంతో ఆమె కోర్టు చుట్టూ తిరగడం అప్పట్లో పెద్ద సంచలనమైంది. సినిమాల విషయానికి వస్తే.. హిందీలో అనేక సినిమాలు చేసిన ఆమె తెలుగులో ఏక్ నిరంజన్ మూవీలో యాక్ట్ చేసింది. చివరగా ఎమర్జెన్సీ చిత్రంలో కనిపించింది. ఈ మూవీలో నటించడంతోపాటు స్వీయదర్శకత్వం వహిస్తూ నిర్మించింది. ప్రస్తుతం ఓ రెండు సినిమాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది.


