మహానటి యూనిట్‌పై జెమినీ కూతురు ఫైర్‌

Kamala Selvaraj Fires On Mahanati Team - Sakshi

తమిళసినిమా: నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కించిన ద్విభాషా చిత్రం నడిగైయార్‌ తిలగం (తెలుగులో మహానటి) ఇటీవలే తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు సావిత్రి పాత్రలో నటించిన నటి కీర్తీసురేశ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి కూడా చిత్రం బాగుందని ప్రశంసించారు. ఇలాంటి పరిస్థితుల్లో సావిత్రి భర్త జెమినీగణేశన్‌ కూతురు, ప్రముఖ వైద్యురాలు కమలాసెల్వరాజ్‌ ఆ చిత్ర యూనిట్‌పై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

ఆమె బుధవారం ఒక వెబ్‌సైట్‌ విలేకరితో మాట్లాడుతూ నడిగైయిన్‌తిలగం చిత్రంలో తన తండ్రి జెమినీ గణేశన్‌ను తప్పుగా చిత్రీకరించారంటూ తీవ్రంగా ఆరోపించారు. తన తండ్రికి కళంకం ఆపాదించేలా చిత్రంలో చూపించారని అన్నారు. తన తండ్రి బిజీ నటుడన్న విషయం అందరికీ తెలిసిన విషయమేనన్నారు. అలాంటిది ఆయన అవకాశాలు లేక ఖాళీగా ఉన్నట్లు చూపించడమేంటని ప్రశ్నించారు.

తొలిప్రేమ సావిత్రిపైనేనా?
నాన్నకు తొలిసారిగా ప్రేమ కలిగింది సావిత్రి పైనే అనేలా చిత్రీకరించారని, అయితే అంతకు ముందు తన తల్లిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నారని అన్నారు. అంటే తన తల్లిపై ప్రేమ లేకుండానే పెళ్లి చేసుకున్నారా అని ప్రశ్నించారు.

నాన్నే సావిత్రికి మద్యం అలవాటు చేశారా?
అదే విధంగా తన తండ్రే సావిత్రికి మద్యం సేవించడం అలవాటు చేసిన తాగుబోతుగా చిత్రంలో చూపించడం చూసి తాను దిగ్భ్రాంతికి గురైయ్యానన్నారు. ఈ చిత్రంలో నాన్నను ప్రేక్షకులు అంగీకరించని నటుడిగా చిత్రీకరించారని, అలాంటప్పుడు ఆయనకు ప్రేక్షకులు కాదల్‌మన్నన్‌ ( ప్రేమరాజు) అనే పట్టం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సావిత్రి ప్రాప్తం చిత్రం చేయడానికి సిద్ధం అయినప్పుడు అంత పెద్ద నటి ఈ రిస్క్‌ తీసుకోవడం ఎందుకు అని తన తండ్రి వద్దని చెప్పారన్నారు.  ఎందరో ప్రముఖ నటులతో నటించిన సావిత్రికి ఆ నటులు సహాయం చేసి కాపాడవచ్చుగా అని అన్నారు. కానీ తన తండ్రే సావిత్రిని కాపాడే ప్రయత్నం చేశారని చెప్పారు.

ప్రేమించిన వాళ్లనే పెళ్లి చేసుకున్నారు
నాన్న గురించి చెప్పాలంటే తనను ప్రేమించిన వారినే ఆయన పెళ్లి చేసుకున్నారని, పెళ్లయిన వారినెవరిని ఆయన చెడగొట్టలేదని అన్నారు.

కుక్కను ఉసిగొల్పి గెంటేశారు
ప్రాప్తం చిత్ర నిర్మాణం చేయాలన్న పంతంతో ఉన్న సావిత్రి నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని చెప్పడానికి నాన్నతో కలసి తానూ ఆమె ఇంటికి వెళితే తమపై కుక్కను వదిలి గెంటేశారని, తాము కుక్క బారి నుంచి తప్పించుకోవడానికి గోడ దూకి పారిపోవలసి వచ్చిందన్నారు. ఆ సంఘటన తరువాత నాన్న మళ్లీ సావిత్రి ఇంటికి వెళ్లలేదని కమలా సెల్వరాజ్‌ చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top