
పెళ్లిని మించి జీవితంలో పెద్ద పండుగ ఏదీ ఉండదు. అలాగే పెళ్లి అయిన తర్వాత వచ్చే తొలి పండుగ కూడా అంతే ప్రధానంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కొత్త దంపతుల జీవితంలో తొలి దీపావళికి మరింత ప్రాధాన్యత ఉంది. దీనిని 'తల' దీపావళి అని పిలుస్తారు. తల దీపావళి’’ అనేది కొత్తగా పెళ్లైన దంపతులు జరుపుకునే మొదటి దీపావళి అని ప్రత్యేక పండుగ అని అర్థం. ‘‘తల’’ అంటే ‘‘మొదటి’’ అని అర్థం. అంటే పెళ్లైన తర్వాత మొదటి దీపావళి అదే ‘‘తల దీపావళి’’. సాధారణంగా, భార్య భర్తల్లో ఎవరి ఇంట్లో మొదటి దీపావళి అయితే, ఆ ఇంట్లో పెద్ద పండుగగా జరుపుతారు. పెళ్లి తర్వాత మొదటి దీపావళి రోజున అమ్మాయిని తల్లిదండ్రుల ఇంటికి ఆహ్వానిస్తారు. ఆమె భర్త కూడా ఆమెకు తోడుగా వెళ్తాడు.
అమ్మాయి తల్లిదండ్రులు వారికి కొత్త దుస్తులు, బహుమతులు వగైరాలు ఇస్తారు. పండుగ రోజున తెల్లవారుఝామున దంపతులు నూనె రాసుకొని అభ్యంగ స్నానం చేస్తారు . కొత్త బట్టలు ధరించడం. పటాకులు పేల్చడం, దీపాలు వెలిగించడం, స్వీట్లు పంచుకోవడం వంటివి మామూలే. అయితే బంధువులు, మిత్రులు వచ్చి భార్య భర్తలకు మంగళసూక్తాలు, ఆశీర్వాదాలు అందించడం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తల దీపావళి రోజున కొత్తగా పెళ్లైన జంటను ‘శుభారంభం‘గా పరిగణిస్తారు. ఇది వారికి ఆశీర్వాదాల పండుగ, భవిష్యత్తులో సుఖసంతోషాలతో జీవితం గడపడం కోసం జరుపుతారు.
ఈ సంవత్సరం దీపావళి పండుగ దక్షిణ భారత సినిమా రంగంలో పలువురు తారలకు తల దీపావళిగా మారనుంది. ఈ మొదటి దీపావళిని సంతోషంగా ఆస్వాదించడానికి పలు సెలబ్రిటీ జంటలు సిద్ధంగా ఉన్నారు, అలాంటి జంటలలో...

–మన మహానటి కీర్తి సురేష్- ఆంటోనీ థటిల్ గత డిసెంబర్‌లో వివాహం చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికారు. వారి మొదటి దీపావళి వారి కొత్త ఇంట్లో కుటుంబంతో జరుపుకోవడానికి చిరస్మరణీయ పండుగ.
–అక్కినేని యువ సామ్రాట్... నాగ చైతన్య శోబిత ధూళిపాల వివాహం తర్వాత వారి జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఈ దీపావళి వారి మొదటి పండుగ.
–వరలక్ష్మి శరత్‌కుమార్ నిచోలాయ్ సచ్‌దేవ్ వారి వివాహం తర్వాత వారి జీవితాల్లో కొత్త ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ తొలి దీపావళి వారి కొత్త ఇంట్లో, కుటుంబం స్నేహితులతో జరుపుకునే వారి మొదటి వేడుక అవుతుంది.
–గత జనవరిలో వివాహం చేసుకున్న , సాక్షి అగర్వాల్, నవనీత్ వారి జీవితాల్లో కొత్త ఆనందాలలో మునిగి తేలుతున్నారు. అదే ఊపులో వారి మొదటి దీపావళిని ఇంట్లో , కుటుంబ అనురాగం స్నేహితుల సమక్షంలో జరుపుకోనున్నారు.
–రమ్య పాండియన్, లవ్వెల్ ధావన్ వివాహం తర్వాత వారి మొదటి దీపావళిని సోమవారం జరుపుకోనున్నారు. ప్రేమ, ఆప్యాయత, కుటుంబ బంధాల నడుమ ఉత్సాహంతో రమ్య పాండియన్ లవ్వెల్ ధావన్ వెలుగుల పండుగను ఆస్వాదించనున్నారు.