
చెన్నై: జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన యమదొంగ చిత్రం ఇప్పుడు విజయన్ పేరుతో కోలీవుడ్‌కు రానుంది. బాహుబలి చిత్రం ఫేమ్ రాజమౌళి 2007లో తెరకెక్కించిన భారీ చిత్రం యమదొంగ. ఆయన ఇప్పటి వరకు 11 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో ఐదు చిత్రాలు తమిళంలో రీమేక్‌గానూ, రెండు చిత్రాలు అనువాదంగానూ, 3 చిత్రాలు అన్ని భాషల్లోనూ ఏక కాలంలో విడుదలయ్యాయి. అలాంటిది యమదొంగ సుమారు 12 ఏళ్ల తరువాత తమిళంలో అనువాదం అవుతుండడం విశేషం. విజయేంద్రప్రసాద్ కథను అందించిన ఈ చిత్రానికి మరగతమణి (ఎంఎం.కీరవాణి) సంగీతాన్ని, కేకే.సెంథిల్‌కుమార్ ఛాయాగ్రహణాన్ని అందించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్‌కు జంటగా ప్రియమణి, మమతామోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. నటి ఖుష్బూ, మోహన్‌బాబు, ప్రధాన పాత్రల్లో నటించగా, నటి రంభ ఒక పాటలో నటించడం విశేషం. భూలోకం, యమలోకంలో జరిగే రసవత్తరమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది.
కాగా ఇప్పుడీ చిత్రాన్ని తమిళంలో విజయన్ పేరుతో ఓం శ్రీసప్త కన్నీయయ్యన్ క్రియేషన్ పతాకంపై ఎం.జయకీర్తి, రేవతి మేఘవన్నన్‌లు అనువదిస్తున్నారు. దీనికి అనువాద రచయిత బాధ్యతలను ఏఆర్‌కే.రాజరాజా నిర్వహిస్తున్నారు. కాగా ఈ చిత్ర విడుదల హక్కులను ఓం శ్రీ మునీశ్వర మూవీస్ సంస్థ పొందింది. డిసెంబర్ 13వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.