ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యాం!

jeevitha rajasekhar interview  about kalki movie - Sakshi

‘‘ఈ వయసులో మనం చేయలేని యాక్షన్‌ సీన్స్‌ చేయగలుగుతున్నామే... అని హ్యాపీ ఫీలయ్యాను. చేయలేకేం కాదు. యాక్షన్‌ సీన్స్‌ని ఎంజాయ్‌ చేస్తూ హ్యాపీగా చేశాను. సినిమాలో ప్రస్తావించిన కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను’’ అన్నారు రాజశేఖర్‌. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్‌ హీరోగా సి. కల్యాణ్‌ నిర్మించిన ‘కల్కి’ గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజశేఖర్‌తో పాటు ఆయన సతీమణి జీవిత చెప్పిన సంగతులు.

నటన, లుక్స్, మేనరిజమ్‌.. ఇలా అన్ని అంశాల్లో ‘కల్కి’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. కలెక్షన్స్‌ పరంగా 60–70 శాతం మార్కులే వచ్చాయి. థియేటర్‌లో 100 పర్సెంట్‌ కలెక్షన్‌ లేదు. ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయ్యాం. ఇలా ఎందుకు జరిగిందని విశ్లేషించుకోవాల్సి ఉంది. మొత్తంగా ‘కల్కి’ నేను అనుకున్న స్పీడ్‌ అందుకోలేదు. త్వరలో అందుకుంటాను. వదలను. మా సినిమాకు కొన్ని బ్యాడ్‌ రివ్యూస్‌ రాశారని తెలిసింది. మంచి సినిమాపై బ్యాడ్‌ రివ్యూస్‌ ప్రభావం చూపలేవు. స్క్రీన్‌ప్లే ఇంకా ఫాస్ట్‌ అండ్‌ గ్రిప్పింగ్‌గా ఉండి ఉంటే వంద మార్కులు సాధించి ఉండేవారమని నా అభిప్రాయం.

సినిమాలో ‘ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి’ అనే డైలాగ్‌ ప్రశాంత్‌ వర్మ ఫస్ట్‌ చెప్పినప్పుడు బాగా రాశారన్నాను. ఈ విషయం జీవితతో చెబితే... ఈ డైలాగ్‌ మీదే కదా అని చెప్పింది. నాపై వేసిన కామెడీ డైలాగ్‌ నాదే అని కూడా తెలియకుండా నటించాను. ఆ తర్వాత ఏవో కామెంట్స్‌ వినిపించాయి. ఆ సినిమా (ఈ డైలాగ్‌ ఉన్న సినిమా) చూడలేదు. విలన్‌ పాత్రలు చేయాలని ఉంది. కానీ రొటీన్‌గా ఉండేవి చేయాలనుకోవడం లేదు.
     
మా ఇద్దరు కూతుర్లు మంచి ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకుంటారనే మాటలు వినిపించడం హ్యాపీగా ఉంది. ఓ సందర్భంలో నేను, శివానీ కలిసి ఓ సినిమా చేద్దాం అనుకున్నాం. కుదర్లేదు. నేను, జీవిత, శివానీ, శివాత్మిక కలిసి భవిష్యత్‌లో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఇదే కాదు నా పిల్లలతో ఎన్ని సినిమాలు వచ్చినా  చేస్తాను. కొడుకులే చేస్తారు? కూతుళ్లు అంతగా చేయలేరు? అనుకున్న నాకు నా కూతుళ్లు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. అంతగా ఇన్‌వాల్వ్‌ అవుతున్నారు.

‘కల్కి 2’ ఉండొచ్చు కానీ ఎప్పుడన్న విషయం గురించి స్పష్టంగా చెప్పలేను. మరోవైపు ప్రవీణ్‌ సత్తారు ‘గరుడ వేగ 2’ స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నారు. జీవిత అవుట్‌లైన్‌ విన్నారు. అయితే నా నెక్ట్స్‌ సినిమా ఏంటీ అని ఇంకా అనుకోలేదు.    

ఇన్‌వాల్వ్‌మెంట్‌ కాదు... కేరింగ్‌
‘‘కల్కి’ సినిమా డైరెక్షన్‌లో జీవిత లీనమయ్యారనే వార్త అక్కడక్కడా వినిపిస్తోంది. దీని గురించి జీవితా రాజశేఖర్‌లు ఈ విధంగా స్పందించారు.
జీవిత: ఈ సినిమా బడ్జెట్‌ దాదాపు 23 కోట్లు అయ్యింది. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసేప్పుడు కరెక్ట్‌గా వస్తుందా? రాదా?.. అంటే యూనిట్‌లో మేం ఒక 10 మెంబర్స్‌ డిసైడింగ్‌ ఫ్యాక్టర్స్‌గా ఉంటాం. ఈ పదిమందికి ముందు నచ్చాలి కదా. రిలీజ్‌ తరవాత పదికోట్లమందికి నచ్చుతుందా? లేదా అన్నది తర్వాతి విషయం. ప్రశాంత్‌ వర్మకు ఇది రెండో సినిమా. పెద్ద సినిమా చేస్తున్నాం. మనం షూట్‌ చేసిన రషెస్‌ పరిశీలించుకున్నప్పుడు అవసరమైతే టీమ్‌ అందరితో కలిసి చర్చించుకోవాలి కదా. అలా చేయడం ఇంటర్‌ఫియరెన్స్‌ అవుతుందా? లేక ప్రాజెక్ట్‌పై మేం తీసుకునే కేర్‌ అవుతుందా?

రాజశేఖర్‌: డైరెక్షన్‌లో కాదు జీవిత డిస్కషన్స్‌లో పాల్గొన్నారు. ఈ కేర్‌ను ఇంటర్‌ఫియరెన్స్‌ అంటే బాధగా ఉంటుంది కదా.

జీవిత: ఇటీవల ‘డిగ్రీ కాలేజీ’ సినిమా ప్రెస్‌మీట్‌లో టీజర్‌ అసభ్యకరంగా ఉందని నా అభిప్రాయం చెప్పాను. సినిమాలో అవసరమైన చోట రొమాన్స్‌ అవసరం. నేనూ నటించాను. మా కూతుళ్లూ నటిస్తున్నారు. ఒక కిస్సింగ్‌ సీనో... ఒక హగ్గింగ్‌ సీనో కథ డిమాండ్‌ చేస్తేనే పెట్టాలి. మణిరత్నంగారు ఎంతో రొమాన్స్‌ చూపిస్తారు. కానీ వల్గర్‌గా అనిపించదు. బాలచందర్‌గారు, విశ్వనాథ్‌గారు, బాపుగారి సినిమాల్లో రొమాన్స్‌ ఉంటుంది. కానీ చూపించాల్సిన విధానంలోనే ఉంటాయి. ఒక సెన్సార్‌ మెంబర్‌గా ఆర్‌సీ (రివైజింగ్‌ కమిటీ) నా దగ్గరకు వచ్చిన కొన్ని సినిమాలు చూస్తుంటే... ఏడవాలో నవ్వాలో తెలియదు.

అదేదో ‘ఏడుచేపల కథ’ అని ఒక సినిమా ఉంది. అందులో అనవసరమైన రొమాన్స్‌ ఉన్నట్లు ఉంది. ఇలాంటివి వద్దు అని చెబుతున్నాను. వెంటనే జీవితగారు తన పాత సినిమాల్లో చేయలేదా? రేపు ఆమె కుమార్తెలు ఎవర్నీ ముట్టుకోరా? రాజశేఖర్‌గారు ఎవరితోనూ రొమాన్స్‌ చేయలేదా? అంటే నేనిప్పుడు దాని గురించి మాట్లాడటంలేదు. రొమాన్స్, లవ్‌ సీన్స్‌ లేకుండా సినిమాలు తీయలేం. కానీ కావాలని అలాంటివి పెట్టొద్దన్నది నా అభిప్రాయం. ఇక ‘కల్కి’లో 30 శాతం అంశాలు కొందరికి నచ్చలేదు. వాటినే పట్టుకుని రాయొద్దని కోరుకుంటున్నాను.

ఎఫ్‌డీసీ (ఫిల్మ్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) చైర్మన్‌ పదవి నాకు ఇవ్వబోతున్నారన్న వార్తలు కేవలం పుకార్లే. వైఎస్‌ జగన్‌గారి కోసం  మాకు దొరికిన తక్కువ సమయంలో చేయగలిగిన ప్రచారం చేశాం. ఆయన గెలిచినందుకు హ్యాపీగా ఉంది. ప్రజలకు చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇప్పుడు నాకైతే ఆంధ్ర, తెలంగాణ అనే ఫీలింగ్‌ పోయినట్లు ఉంది. ఇంతకుముందు ఆంధ్ర, తెలంగాణ వేర్వేరు అనే ఫీలింగ్‌ ఉండేది సైకలాజికల్‌గా. ఇప్పుడు ఇద్దరు సీయంలు (ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌) మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు కనిపిస్తోంది.  
– జీవిత

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top