చెప్పాలనుకుంటే చెబుతా

ileana interview about amar akbar anthony - Sakshi

‘‘ఇన్ని సంవత్సరాలు తెలుగులో కావాలని గ్యాప్‌ తీసుకోలేదు. బాలీవుడ్‌కి వెళ్లాక వరుస సినిమా ఆఫర్‌లు వచ్చాయి. అలా కంటిన్యూ అయిపోయాను. ఈలోపు నేను కావాలనే తెలుగుకి దూరంగా ఉంటున్నానని మిస్‌అండర్‌స్టాడింగ్‌ చేసుకున్నారు. ఏదేదో అనుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌ని బ్యాలెన్స్‌ చేద్దాం అనుకున్నాను. కానీ బ్యాలెన్స్‌ మిస్‌ అయింది (నవ్వుతూ)’’ అని ఇలియానా అన్నారు. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను ౖÐð ట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, మోహన్‌ చెరుకూరి, రవిశంకర్‌ నిర్మించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్‌ కానుంది. ఆరేళ్ల గ్యాప్‌ తర్వాత ఇలియానా మళ్లీ తెలుగులో కనిపించనున్న చిత్రం ఇది. ఈ సందర్భంగా మీడియాతో ఇలియానా పలు విశేషాలు పంచుకున్నారు.

► ఈ సినిమా ఒప్పుకోవడానికి మొదటి కారణం కథ. వినగానే చాలా ఎగై్జట్‌ అయ్యాను. అలాగే రవితేజ కూడా ఉన్నారు. రవి నా ఫేవరెట్‌ కో–స్టార్‌. ఇద్దరం కలసి ఆల్రెడీ మూడు సినిమాలు చేశాం. ఇది నాలుగో సినిమా. ఈ సినిమాలో నా పాత్ర గురించి ఎక్కువ చెప్పకూడదు. నా పాత్ర పేరు చెప్పినా కూడా సినిమాలో క్లూ చెప్పేసినట్టే అవుతుంది.

► ఈ మధ్యలో కూడా కొన్ని సినిమాలు, స్పెషల్‌ సాంగ్స్‌ చేయమని ఆఫర్స్‌ వచ్చాయి. స్క్రిప్ట్స్‌ కుదరక మిస్‌ అయ్యాయి. సాంగ్స్‌ చేయాలంటే అది ఆ సినిమాకు ఉపయోగపడుతుందా? లేదా? అని ఆలోచించాను. అంత స్పెషల్‌గా ఉండదనిపించి వదిలేశాను. ఇటీవల ఓ పెద్ద సినిమా కూడా వదిలేశా. మంచి స్క్రిప్ట్, మంచి టీమ్‌ ఉన్నా నా పాత్ర చాలా చిన్నదిగా ఉండడంతో చేయలేదు.

► ‘దేవదాసు’తో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా వయసు 17,18.  ఏ సినిమా వచ్చినా చేసేశాను. వయసు పెరిగే కొద్దీ మన ఆలోచన తీరు కూడా పెరుగుతుంది. మనం చేస్తున్న వృత్తి పట్ల ఇంకా గౌరవంగా ఉంటాం. మంచి సినిమాలు చేయాలనుకుంటాం. ప్రస్తుతానికి మంచి సబ్జెక్ట్స్‌ ఎంచుకుంటున్నాను. డ్రీమ్‌రోల్స్‌ లాంటివి పెద్దగా ఏం లేవు. యువరాణిలా చేయాలి, యోధురాలిగా కత్తి విద్యలు చేయాలి అని పెద్దగా అనుకోను. నా దర్శకులు అలాంటి పాత్ర చేయిస్తే చేస్తానేమో.

► నా కెరీర్‌ పట్ల సంతృప్తికరంగా ఉన్నాను. తప్పులు, ఒప్పులు అన్నీ ఉంటాయి. వాటి నుంచి నేర్చుకోవడమే. ‘పోకిరి’ సినిమా సమయంలో అనుకుంటా... ఆ సినిమా చేయాలా వద్దా అనుకున్నాను. మహేశ్‌ సోదరి మంజుల చేయమని చెప్పారు. ఆవిడ చెప్పకపోతే నా కెరీర్‌లో నిజంగా ఓ స్పెషల్‌ ఫిల్మ్‌ మిస్‌ అయ్యుండేదాన్ని.

► ‘అమర్‌ అక్బర్‌..’ సినిమాలో నా పాత్రకు స్వయంగా నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. తెలుగు డబ్బింగ్‌ చెప్పుకుంటానని అనుకోలేదు. శ్రీనుగారు బావుంటుందని చెప్పించారు. డబ్బింగ్‌ స్టూడియోకి వెళ్లి చెప్పేవరకూ నమ్మకం కుదర్లేదు. నేను డబ్బింగ్‌ చెప్పడం ఏంటీ? అని. ఎందుకంటే తెలుగు భాష స్పష్టంగా పలకకపోతే పాత్ర దెబ్బ తింటుంది. నా వాయిస్‌ నాకు నచ్చలేదు. (నవ్వుతూ).

► నేను నటిని. సెట్లో నటిస్తాను. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే అందరిలాగానే నార్మల్‌గా ఉంటా. వండుకోవడం, ఇళ్లు శుభ్రం చేసుకోవడం అన్నీ నేనే చేసుకుంటాను. కానీ పర్సనల్‌ లైఫ్‌ పర్సనల్‌గా ఉంటేనే బావుంటుంది అని అనుకుంటున్నాను. అది కూడా నా వ్యక్తిగత విషయాలు చెప్పాలనుకుంటే చెబుతాను.. అలాగే మొత్తం చెప్పను (నవ్వుతూ).  

► ప్రస్తుతం మానసిక ఆరోగ్యం గురించి మనందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని అర్థం చేసుకోగలగాలి. నేనే అర్థం చేసుకోలేకపోయాను. కానీ కొన్ని రోజులు మానసికంగా ఇబ్బంది పడ్డాను. యాంగై్జటీ, డిప్రెషన్‌లోకి వెళ్లడం ఇవన్నీ నార్మల్‌ బిహేవియర్‌ కాదు. సో.. అందరూ ఈ మానసిక ఆరోగ్యం మీద అవగాహన పెంచుకోవాలి.
 

► ‘మీటూ’ గురించి మాట్లాడుతూ – ‘‘చాలా మంది స్త్రీలు బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలు చెబుతున్నారు. అలా చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. ‘మీటూ’  ఉద్యమం కచ్చితంగా ఓ మార్పు తీసుకు రావాలని కోరుకుంటున్నాను’’ అంటున్న ఇలియానాతో మీకు ఇటువంటి సంఘటనలు ఎదురయ్యాయా? అని అడగ్గా – ‘‘ఆ విషయాల గురించి నేను మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడతాను’’ అన్నారు. పోనీ మీ బాయ్‌ ఫ్రెండ్‌ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ ఏంటీ? అని అడిగితే – ‘‘ ప్రస్తుతానికి మా రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ హ్యాపీ’’ అని చెప్పారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top