క్రీడాకారిణిగా నటించాలని ఆశ! | I Like To Acting Athlete Role in Movie Said Samantha | Sakshi
Sakshi News home page

క్రీడాకారిణిగా నటించాలని ఆశ!

Apr 15 2019 9:08 AM | Updated on Jul 14 2019 4:41 PM

I Like To Acting Athlete Role in Movie Said Samantha - Sakshi

సమంత

సినిమా: ప్రతి మనిషి జీవితం పెళ్లికి ముందు ఆ తరువాతలా  ఉంటుంది. అందుకు నటీమణులు అతీతం కాదు. సంచలన నటి సమంత ఆ విషయాన్నే అంటోంది. తనకు అనిపించింది నిర్భయంగా చెప్పేసే నటి సమంత. ఈ సుందరి వివాహం ముందు ఆ తరువాత జరుగుతున్న విషయాల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అవేంటో చూద్దాం. వివాహానంతరం మనసుకు ప్రశాంతత లభించింది. పెళ్లికి ముందు నేను నటించిన ప్రతి సన్నివేశాన్ని నేను మానిటరింగ్‌ చేసుకుని నటించేదాన్ని. బాగా నటించానా అన్నది నాకు నేనే పరిశీలించుకునేదాన్ని. వివాహానంతరం నా భర్త నాగచైతన్య నటించే సన్నివేశాలను మానిటరింగ్‌ చేస్తున్నాను. తగిన సలహాలు ఇస్తుంటాను. ఇదంతా చూసి నా భర్త నువ్వెందుకు కష్టపడతావు దర్శకుడు చూసుకుంటారుగా అని అంటుంటారు. అయినా నేను ఊరుకోను. భర్త గురించి ఆలోచించడం భార్య బాధ్యత. వివాహానంతరం మా మధ్య ఒక ఒప్పందం చేసుకున్నాం. మేమిద్దం సెలబ్రిటీలమే. మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. మాపై అభిమానుల అంచనాలు అధికంగానే ఉంటాయి. వాటిని పూర్తి చేయడానికి మంచి కథా చిత్రాల్లోనే కలిసి నటించాలన్నదే ఆ ఒప్పందం.

అలా నటించిన చిత్రమే మజిలీ. ఇకపై కూడా వైవిధ్యభరిత కథా చిత్రాలను చేయాలన్నదే నా కోరిక. నిజ జీవితానికి సినిమా జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. నాగచైతన్య ఒక సన్నివేశంలో బాగా నటిస్తే ప్రశంసిస్తాను. ఆశించిన విధంగా నటించకపోతే తిట్టేస్తాను. ఇకపోతే నేను నటించే చిత్రంలో నటించడానికి ఒప్పుకుంటే ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కథలో తల దూర్చను. అదే కథ నచ్చకపోతే ఆ తరువాత ఎన్ని మార్చులు చేసినా నటించడానికి అంగీకరించను. సినీనటిగా ఒక లక్ష్యాన్ని చేరుకున్నాను. సినిమా విషయంలో నా శ్రద్ధ ముందు కంటే ఇప్పుడు ఎక్కువ అయ్యింది. ఐదారు చిత్రాల్లో ఒకే సారి నటించడం కంటే మంచి కథా చిత్రం ఒక్కటి చేస్తే చాలు అని భావిస్తున్నాను. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో నా గురించి పలు విమర్శలు ప్రచారం అవుతున్నాయి. అయితే అలాంటి వాటిని పట్టించుకోవడం మానేశాను. తమిళంలో నేను నటించిన సూపర్‌ డీలక్స్‌ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. ఇందులో నేను స్వతంత్ర భావాలు కలిగిన యువతిగా నటించాను.

దానిని పలువురు విమర్శిస్తున్నారు. నటిస్తున్నప్పుడు సహ నటుడిపై చేయి వేయడం, ముద్దు పెట్టడం, సన్నిహిత సన్నివేశాల్లో నటించడం, పాత్రకు తగ్గట్టుగా నటించడం నా వృత్తి. ఎందుకంటే నేను నటిని. నటించకుండా ఎలా ఉండగలను. ముందే చెప్పినట్లు, సినిమా జీవితం వేరు, నిజజీవితం వేరు. నిజ జీవితంలో నేను భావోద్రేకాలకు గురవ్వను. అలసిపోను. అందుకు విభిన్నంగా మజిలీ చిత్రంలో నటించాను. కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నిజంగానే గ్లిజరిన్‌ లేకుండా ఏడ్చేశాను. ప్రస్తుతం హీరోయిన్లకు ప్రాధాన్యత కలిగిన చిత్రాలు వస్తున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ విషయమే. నాకు ఒక క్రీడాకారిణిగా నటించాలన్నది ఆశ. అదే విధంగా దివ్యాంగురాలిగానూ నటించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు విరామం లేకుండా నటిస్తున్నాను. కాస్త నటనకు గ్యాప్‌ తీసుకుందామంటే సమంతకు అవకాశాలు లేవు అని ప్రచారం చేసేస్తారు. తమిళ చిత్రం 96 రీమేక్‌లో నటించబోతున్నాను. ఇది మేలో సెట్‌పైకి వెళ్లబోతోంది. తాజాగా నటించిన ఓ బేబీ ఎంత చక్కగున్నావే చిత్రం త్వరలో తెరపైకి రానుంది అని నటి సమంత పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement