బుల్లితెర నడిగర్‌ సంఘానికి చతుర్ముఖ పోటీ

Huge Competition For Nadigar Sangam Elections - Sakshi

పెరంబూరు: ఎన్నడూ లేనంతగా చతుర్మఖ పోటీగా సాగిన తమిళనాడు బుల్లితెర నడిగర్‌ సంఘం ఎన్నికలు ఉత్కంఠతను రేకెత్తిస్తున్నాయి. ఈ సంఘానికి ఎన్నికల మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటాయి. కాగా ప్రస్తుత నిర్వాహకం పదవీకాలం పూర్తి కావడంతో శనివారం సంఘం ఎన్నికలు జరిగాయి. పోటీలో జట్లు విరుగంబాక్కమ్‌లోని ఏకేఆర్‌ మహాల్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రస్తుత కార్యవర్గ అధ్యక్షుడు శివన్‌ శ్రీనివాసన్‌ జట్టు మళ్లీ పోటీ చేస్తుండగా, నటి నిరోషా జట్టు, రవివర్మ జట్టు, బోస్‌వెంకట్‌ జట్టు అంటూ నాలుగు జట్లు పోటీ పడ్డాయి. నటి నిరోషా జట్టులో భరత్‌ కార్యదర్శి పదవికి, ఎస్‌.శ్రీధర్‌ కోశాధికారి పదవికి, వీటీ.దినకరన్, కన్యాభారతీ ఉపాధ్యక్ష పదవికి, విజయ్, ఆనంద్, రవీంద్రన్, మోనిక ఉపకార్యదర్శి పదవులకు పోటీ చేశారు.

అదే విధంగా శివన్‌ శ్రీనివాసన్‌ జట్టులో కార్యదర్శి పదవికి భరత్‌కల్యాణ్, ఉపాధ్యక్షపదవికి రాజశేఖర్, మనోబాలా, కోశాధికారి పదవికి శ్రీవిద్య, ఉపకార్యదర్శి పదవులకు దళపతిదినేశ్, ఎంటీ.మోహన్‌ కర్పగవల్లి, సవాల్‌రావ్‌ పోటీలో ఉన్నారు. ఇక బోస్‌వెంకట్‌ జట్టులో కార్యదర్శి పదవికి పీకే.గణేశ్, ఉపాధ్యక్ష పదవికి సోనియా, ఎల్‌.రాజా, కోశాధికారి పదవికి రవీందర్, ఉప కార్యదర్శి పదవులకు కే.దేవానంద్, దాడి బాలాజి, శ్రద్ధిక, కే.కమలహాసన్‌ పోటీ చేశారు. సంఘంలో మొత్తం 1,551 సభ్యులు ఉన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలీంగ్‌ సాయంత్రం 5 గంటల వరకూ జరిగింది. సినీ దర్శకుడు లియాఖత్‌అలీఖాన్‌ ఎన్నికల అధికారిగా నిర్వహించిన ఈ ఎన్నికలు గట్టి పోలీస్‌బందోబస్తు మధ్య జరిగాయి. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల లెక్కింపు మొదలైంది. అయితే ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top