లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు

High Court Clears Lakshmis NTR Release - Sakshi

నందమూరి తారక రామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చాక ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’. రామ్‌గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ఏ జీవీ ఆర్జీవీ ఫిల్మ్స్‌ సమర్పణలో రాకేష్‌ రెడ్డి–దీప్తి బాలగిరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ చిత్రాన్ని ముందుగా అనుకున్న తేదీ కంటే వారం ఆలస్యంగా ఈ నెల 29న సినిమాని రిలీజ్‌ చేస్తున్నట్లు వర్మ ట్విట్టర్‌లో ప్రకటించారు. ‘‘ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని, కాబట్టి ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం విడుదల ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

లా అండ్‌ ఆర్డర్‌కి ఇబ్బంది కలగకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు విన్నవించడంతో పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేసింది. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాని ఆపడం కుదరదు. భావస్వేచ్ఛ హక్కు విషయంలో మేము కలగజేసుకోం’’ అంటూ సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు వర్మ. త్వరలో కడపలో ‘వెన్నుపోటు ఈవెంట్‌ ఎన్టీఆర్‌ నైట్‌’ పేరున నిర్వహించే వేడుకలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఆడియోను విడుదల చేయనున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top