చాలామందికి నా పేరు తెలియదు

Guna 369 Trailer Launch - Sakshi

– కార్తికేయ

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ, అనఘా జంటగా నటించిన చిత్రం ‘గుణ 369’. అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో తిరుమల్‌ రెడ్డి, అనిల్‌ కడియాల నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు బోయపాటి శ్రీను కలిసి ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్‌ బోయపాటిగారి సినిమా ట్రైలర్‌లా అనిపించింది. ఈ సినిమా నిర్మాతలకు ఎంటర్‌టైన్మెంట్‌ కొత్త కాదు. సినిమా నిర్మాణం మాత్రమే కొత్త.

మొదటి సినిమాతోనే తనలో ఉన్న నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు కార్తికేయ. మా బ్యానర్‌లో బోయపాటిగారి దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ సినిమాకు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో అర్జున్‌ చురుకుగా పని చేశారు. అర్జున్‌ దర్శకత్వం వహించిన ఈ ‘గుణ 369’ మంచి విజయం సాధించాలి. అలాగే బోయపాటిగారితో మరో సినిమా ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘అర్జున్‌ మంచి సినిమా తీశాడు. ట్రైలర్‌ బాగుంది. కథలో ఏదో కొత్తదనం కనిపిస్తోంది. తప్పకుండా విజయం సాధిస్తుంది’’ అన్నారు బోయపాటి శ్రీను. ‘‘నా హృదయానికి దగ్గరైన చిత్రం ఇది.

సినిమాలో హీరోలు హీరోలుగా హీరోయిన్లు హీరోయిన్లుగా ఉండరు. తెలుగులో మంచి ఎమోషనల్‌ సినిమాలు రావడం లేదనేవారికి ఈ సినిమా గట్టి సమాధానంగా ఉంటుంది. ఇప్పటికీ నా పేరు చాలామందికి తెలియదు ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో అంటారు. ఈ సినిమా తర్వాత గుణ అని పిలుస్తారనుకుంటున్నా. అర్జున్‌ బాగా తీశారు. గుణ, గీతల జర్నీని సినిమా లవర్స్‌ మిస్‌ కావొద్దు’’ అన్నారు కార్తికేయ. ‘‘మాకు చెప్పిన కథను చెప్పినట్లు తీశారు అర్జున్‌. కార్తికేయకు నటన పట్ల అద్భుతమైన తపన ఉంది’’ అన్నారు తిరుమల్‌ రెడ్డి.

‘‘టీవీ షోలు చేస్తూ ఎంటర్‌టైన్మెంట్‌ ఫీల్డ్‌లోనే ఉన్నాం. చిన్న సినిమాతో ఇండస్ట్రీకి వద్దామనుకున్నాం. ‘గుణ 369’ వంటి పెద్ద సినిమాతో వస్తున్నాం. కార్తికేయ బాగా చేశాడు. సెకండాఫ్‌లో మంచి ఎమోషన్‌ ఉంది’’ అన్నారు అనిల్‌. ‘‘నన్ను, నా కథను నమ్మిన ప్రవీణగారికి థ్యాంక్స్‌. తిరుమల్‌రెడ్డి, అనిల్‌ బాగా సహకరించారు. కార్తికేయ మంచి నటను కనబరిచారు. గుణ పాత్రలో ప్రతి ఒక్కరు తమను తాము చూసుకుంటారు’’ అన్నారు అర్జున్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top