
దర్శకుడు గౌతమ్ మీనన్
సాక్షి, పెరంబూరు: డైరెక్టర్ గౌతమ్ మీనన్‌కు మద్రాసు హైకోర్టు చుక్కెదురైంది. కచ్చదీవుల్లోని అంథోనియార్ దేవాలయంలో నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొనడానికి అనుమతి కోరుతూ ఆయన మద్రాసు కోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన హైకోర్టు అందుకు నిరాకరించింది. వివరాలివి.. సినీ దర్శకుడు గౌతమ్‌మీనన్ కచ్చదీవుల్లోని అంథోనియార్ దేవాలయంలో జరగనున్న ఉత్సవాల్లో పాల్గొనడానికి ‘ అభ్యంతరం లేదనే’ ( నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) ధ్రువపత్రాన్ని స్థానిక పోలీసుల నుంచి పొందాల్సి ఉందన్నారు.
అందుకు చెన్నై పోలీస్‌కమిషనర్, ట్రిప్లికేన్ అసిస్టెంట్ పోలీస్‌కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చానని డైరెక్టర్ అన్నారు. అయితే వారు స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. డైరెక్టర్ పిటిషన్‌ను న్యాయమూర్తి ఎంఎస్.రమేష్ విచారణకు స్వీకరించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల నుంచి వివరాలు సేకరించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆయన ఆదేశించారు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది.
పోలీసుల తరఫున న్యాయవాది రాజా హాజరై దర్శకుడు గౌతమ్‌మీనన్‌పై మూడు దేశద్రోహం కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ కారణంగా ఆయనకు కచ్చదీవులకు వెళ్లడానికి అనుమతి నిరాకరించినట్లు వివరించారు. దీంతో న్యాయమూర్తి ఈ ధ్రువపత్రం ఇవ్వడానికి సాధ్యం కాదని దర్శకుడి తరఫు న్యాయవాదికి తెలిపారు. అనంతరం కేసు విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేశారు.