
సాక్షి, చెన్నై: సీనియర్ దర్శకుడు మహేంద్రన్ అస్వస్థతకు గురయారు. ఆయన్ని వైద్య చికిత్స కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఉరుదిపూక్కల్, ముల్లుం మలరుం వంటి పలు విజయవంతమైన తమిళ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మహేంద్రన్. రజనీకాంత్, కమలహాసన్‌లతో పలు చిత్రాలను చేసిన మహేంద్రన్ ఈ మధ్య నటుడు విజయ్ నటించిన తెరి చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే.
ఆ చిత్రంలో ప్రతినాయకుడిగా పాత్రను రక్తిగట్టించిన మహేంద్రన్‌కు వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. తాజాగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన నిమిర్ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు. ఈ నెల 26న మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో మహేంద్రన్ అకస్మాత్తు ఆనారోగ్యానికి గురికావడంతో ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.