వారికి శేష్‌ ఒక ఉదాహరణ

Dil Raju Speech At Evaru Movie press Meet - Sakshi

– ‘దిల్‌’ రాజు

‘‘ఇండస్ట్రీలో మాకు బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు’ అని చాలామంది అంటుంటారు. వారందరికీ అడివి శేష్‌ ఒక ఉదాహరణ. ప్రతిభ ఉండి కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది’’ అన్నారు నిర్మాత ‘దిల్‌’రాజు. అడివి శేష్, రెజీనా, నవీన్‌చంద్ర ముఖ్య తారాగణంగా వెంకట్‌ రామ్‌జీ దర్శకత్వంలో పీవీపీ పతాకంపై పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నే నిర్మించిన చిత్రం ‘ఎవరు’. ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోందని చిత్రబృందం చెబుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ–‘‘ఒక స్టోరీ ఎలా ఉంది? ఏంటి? అంటే నేను చెప్పగలను కానీ ఇలాంటి ట్విస్ట్‌లతో కూడుకున్న సినిమాను నేను సరిగ్గా జడ్జ్‌ చేయలేను. ‘ఎవరు’ సినిమా చూశాను. పాటలు, ఫైట్స్‌ లేవు. వరుస ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ను థియేటర్‌లో కూర్చోబెట్టారు. ఇటీవల ఇలాంటి సినిమా తెలుగులో రాలేదు. ఈ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్‌ చేసినందుకు హ్యాపీ. అడివి శేష్‌ని క్యారెక్టర్‌ ఆర్టిస్టు అనాలా? లేక హీరో అనాలా?.. డైరెక్టర్‌ రామ్‌జీ యాక్టర్‌ అనమంటున్నారు.

‘క్షణం’, ‘గూఢచారి’ ఇప్పుడు ‘ఎవరు’ వంటి సినిమాలతో శేష్‌ యాక్టర్‌గా ఎదుగుతున్నాడు. మా బ్యానర్‌లో సినిమా చేయమని అడిగాను. రెజీనా, నవీన్‌చంద్ర బాగా నటించారు. ‘నేను లోకల్‌’ సినిమా సమయంలో నవీన్‌చంద్రకు హీరోగానే కాకుండా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా ట్రై చేయమని చెప్పాను. అతను బాగా చేస్తున్నారు. చాలామంది హీరోలకు ఇలా చెబితే ..‘రాజుగారి ఏంటీ ఇలా చెబుతారు.. హీరోగా చేయమని ఎంకరేజ్‌ చేయాలి కదా’ అనుకుంటారు. ఏళ్ల తరబడి హీరోలుగా చేసిన వారు కూడా ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేయాల్సిందే.

క్యారెక్టర్‌ ఆర్టిస్టు ఎప్పుడూ ఉంటాడు. నా మిత్రుడు పీవీపీ బ్యానర్‌లో మరో మంచి సినిమా వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘సినిమా విజయం సాధించడంతో మంచి హ్యాపీ మూడ్‌లో ఉన్నాను. చాలాకాలం తర్వాత హాయిగా ఎనిమిది గంటలు నిద్రపోయాను. ‘దిల్‌’ రాజుగారి ‘ఎవడు’ సినిమాలో మెయిన్‌ విలన్‌గా చేయడానికి అప్పట్లో ప్రయత్నించాను. కుదర్లేదు. బహుశా.. నేను అప్పటికీ ఆ స్థాయిలో లేనేమో. ఇప్పుడు ‘దిల్‌’ రాజుగారు ‘ఎవరు’ సినిమా చూసి అభినందించడం మరిచిపోలేను.

సినిమా చూసి మా బ్యానర్‌లో ఎప్పుడు సినిమా చేస్తున్నావ్‌? అన్నారు. హ్యాపీ ఫీలయ్యాను. కలెక్షన్స్‌ గురించి మాట్లాడను. కానీ ‘గూఢచారి’ కంటే ఎక్కువ కలెక్షన్స్‌ వచ్చాయని చెప్పగలను’’ అన్నారు అడివి శేష్‌.‘‘‘అరవిందసమేత..’లో చేసిన బాల్‌ రెడ్డి పాత్రలానే ‘ఎవరు’లో నేను చేసిన అశోక్‌ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. హీరోగానే కాదు.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ ట్రై చేయమన్న ‘దిల్‌’ రాజుగారి సలహాను పాటిస్తూనే ఉంటాను’’ అన్నారు నవీన్‌చంద్ర.

‘‘ఇది సమిష్టి విజయం’’ అన్నారు వెంకట్‌ రామ్‌జీ. ‘‘సక్సెస్‌ను అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌ అన్నారు మురళీ శర్మ. ‘‘ఈ సినిమాకు, నేను చేసిన సమీర పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సింగిల్‌ స్క్రీన్‌కి వెళ్లి చూశాం. ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమాలోని ట్విస్ట్‌లను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి చూడబోయేవారి ఆసక్తిని తగ్గించవద్దు. వారు కూడా సినిమాను థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి’’ అన్నారు రెజీనా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top