‘దేవదాస్‌’ మూవీ రివ్యూ

DevaDas Telugu Movie Review - Sakshi

టైటిల్ : దేవదాస్‌
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న, కునాల్ కపూర్‌
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : శ్రీరామ్‌ ఆదిత్య
నిర్మాత : అశ్వనీదత్‌

సీనియర్‌ హీరో నాగార్జున, నేచురల్ స్టార్‌ నాని కాంబినేషన్‌ లో తెరకెక్కిన మల్టీస్టారర్‌ సినిమా దేవదాస్‌. చాలా కాలం తరువాత వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో అశ్వనీదత్‌ స్వయంగా నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమాకు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. భలే మంచి రోజు, శమంతకమణి లాంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన శ్రీరామ్‌ ఆదిత్య.. నాగ్‌, నాని లాంటి స్టార్లను డైరెక్ట్ చేస్తుండటంతో దేవదాస్‌పై మంచి హైప్‌ క్రియేట్ అయ్యింది. మరి ఆ అంచనాలను శ్రీరామ్‌ ఆదిత్య అందుకున్నాడా..? మల్టీస్టారర్‌గా తెరకెక్కిన దేవదాస్‌ సక్సెస్‌ అయ్యిందా..? నాగ్‌,నానిల కాంబినేషన్ ఏ మేరకు అలరించింది..?

కథ ;
దేవ (నాగార్జున) ఓ మాఫియా డాన్‌. తనను ఆదరించి పెంచిన దాదా(శరత్‌ కుమార్‌)ను ప్రత్యర్థులు చంపేయటంతో పదేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న దేవ బయటకు వస్తాడు. దేవ సిటీకి తిరిగి వస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్‌ తెలుసుకున్న పోలీసులు ఎలాగైన దేవాను పట్టుకోవాలని స్కెచ్‌ వేస్తారు. అదే సమయంలో దాదాను చంపిన డేవిడ్‌(కునాల్ కపూర్‌) గ్యాంగ్ కూడా దేవను చంపడానికి ట్రై చేస్తుంది. ఓ పోలీస్‌ అటాక్‌లో గాయపడిన దేవకు డాక్టర్‌ దాస్‌ (నాని) ట్రీట్‌మెంట్‌ చేస్తాడు. తాను క్రిమినల్‌ అని తెలిసినా పోలీస్‌లకు పట్టివ్వని దాస్‌ మంచితనం చూసి, దేవ అతనితో ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా దాస్‌ కూడా దేవకు మంచి ఫ్రెండ్ అయిపోతాడు. మనుషులను చంపటం తప్ప ప్రేమించటం తెలియని దేవ.. మనుషులను అమాయకంగా నమ్మటం, ప్రేమించటం మాత్రమే తెలిసిన దాస్‌ల మధ్య స్నేహం ఎలా కుదిరింది..? దేవ పోలీసుల నుంచి డేవిడ్‌ గ్యాంగ్‌నుంచి ఎలా తప్పించుకున్నాడా..? దాదాను చంపిన వారి మీద పగ తీర్చుకున్నాడా..? ఈ ప్రయాణంలో దేవ, దాస్‌లు.. ఎవరు ఎవరిలా మారిపోయారు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
కింగ్ నాగార్జున మరోసారి తనదైన స్టైలిష్‌ లుక్‌తో మెస్మరైజ్‌ చేశాడు. గత చిత్రం ఆఫీసర్‌తో పోలిస్తే ఈ సినిమాలో మరింత యంగ్‌గా కనిపించాడు. యాక్షన్‌, రొమాన్స్‌లతో పాటు కామెడీతోనూ ఆకట్టుకున్నాడు. ఫుల్‌ ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌తో అలరించాడు. యంగ్ హీరో నాని కూడా తనదైన నేచురల్ పర్ఫామెన్స్‌ తో మెప్పించాడు. అమాయకుడిగా కనిపిస్తూనే మంచి టైమింగ్‌తో కామెడీ పండించాడు. ముఖ్యంగా నాగ్‌, నానిల మధ్య వచ్చే సన్నివేశాల్లో వారిద్దరి కెమిస్ట్రీ సినిమాను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చింది. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ ఇద్దరి నటన సూపర్బ్‌.

సినిమా అంతా దేవ, దాస్‌ల చుట్టూనే తిరుగడంతో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేదు. ఉన్నంతలో ఆకాంక్ష సింగ్, రష్మికలు ఆకట్టుకున్నారు. విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్‌ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నా.. ఆ పాత్రను పెద్దగా ఎలివేట్ చేయలేదు. ఇతర పాత్రల్లో నరేష్‌, వెన్నెల కిశోర్‌, సత్య, మురళీశర్మ, అవసరాల శ్రీనివాస్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేషణ ;
ఇంతవరకు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన అనుభవం లేకపోయినా.. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య దేవదాస్‌ను బాగానే డీల్ చేశాడు. తను అనుకున్న కథకు తెర రూపం ఇవ్వటంలో విజయం సాధించాడు. అయితే కథనం మాత్రం పడుతూ లేస్తూ రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా సాగుతుంది. హీరోలుగా నాగ్‌, నానిలను ఎంచుకున్నప్పుడే సగం విజయం సాధించిన ఈ యువ దర్శకుడు వారిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నాడు. ఫస్ట్‌ హాఫ్ దేవ, దాస్‌ల మధ్య ఫ్రెండ్‌షిప్‌, కామెడీ ఆకట్టుకున్నా.. ప్రేమకథలు ఆసక్తికరంగా లేకపోవటం నిరాశకలిగిస్తుంది. 

ముఖ్యంగా ఎమోషనల్‌ డ్రామా స్టార్ట్‌ అయిన తరువాత కథనం బాగా స్లో అయ్యింది. అయితే దేవ క్యారెక్టర్‌ ఎలివేషన్‌, కామెడీతో అన్ని మర్చిపోయేలా చేశాడు దర్శకుడు. చాలా రోజులు తరువాత ఓ స్టార్ హీరో సినిమాకు సంగీతమందించిన మణిశర్మ తన మార్క్‌ చూపించాడు. నేపథ్య సంగీతం విషయంలో మణిశర్మకు తిరుగులేదని దేవదాస్‌తో మరోసారి ప్రూవ్‌ అయ్యింది. సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ శ్యామ్‌ దత్‌ సినిమాటోగ్రఫి. ప్రతీ ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌ గా చూపించేందుకు శ్యామ్‌ పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;
నాగార్జున, నానిల నటన
కామెడీ
సినిమాటోగ్రఫి

మైనస్‌ పాయింట్స్‌ ;
ప్రీ క్లైమాక్స్‌
కొన్ని బోరింగ్‌ సీన్స్‌

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top