నువ్వు నా సూపర్ డ్రగ్: దీపికా

ముంబై : వివాహ బంధంలో ఇటీవలే మొదటి ఏడాది పూర్తి చేసుకున్నారు బాలీవుడ్ క్యూట్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్. వీరి మొదటి పెళ్లి రోజు సందర్భంగా తిరుమలకు వచ్చి వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అమృతసర్‌లోని స్వర్ణదేవాలయానికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇక సమయం చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో ఒకరిమీద ఒకరికీ ఉన్న ప్రేమను తెలియజేస్తూ ఉంటారు దీప్‌వీర్ జంట. తాజాగా దీపికా తన భర్త మీద ఉన్న ప్రేమను ట్విటర్ వేదికగా మరోసారి చాటుకున్నారు. రణ్‌వీర్ టీషర్టు ధరించి వెనకు తిరిగి ఉండగా తన షర్టుపై ‘ప్రేమ ఒక గొప్ప శక్తి’ (లవ్ ఈజ్ సూపర్ పవర్) అని ఉన్న ఫొటోను షేర్ చేశారు.
ఈ సందర్భంగా.. షర్టు మీద ఉన్న మాటలను ఉద్దేశించి.. అందుకు బదులుగా ‘నువ్వు నా సూపర్ డ్రగ్’ అంటూ దీపికా పేర్కొన్నారు. కాగా సినిమాల విషయానికొస్తే 1983 క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘83’ మూవీలో ఇద్దరు బీజీగా ఉన్నారు. జీవితాన్ని షేర్ చేసుకున్న ఈ రియల్ కపుల్ ఈ సినిమాలో రీల్ కపుల్‌గా కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. వివాహం తర్వాత రణ్‌వీర్– దీపికా కలసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన యాసిడ్ దాడిలో గాయపడ్డ లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘చపాక్’ సినిమాలో దీపికా నటిస్తున్న విషయం తెలిసిందే. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో దీపికా నిర్మాతగా కూడా ఎంట్రీ ఇస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి