బహుముఖ ప్రజ్ఞాశాలి దాసరి






సినీ ప్రపంచంలో, ముఖ్యంగా తెలుగు సినిమా రంగంపై తనదంటూ ప్రత్యేక ముద్ర వేసిన దాసరి నారాయణరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. సినీ రంగంలో ఉత్థాన పతనాలను చూసిన ఆయన పత్రికా ప్రపంచంలోకి అడుగుపెట్టి ‘ఉదయం’ పత్రికకు ఊపిరులూదారు. ఆ పత్రిక ద్వారా తెలుగు జర్నలిజంలో కొత్త ఒరవడికి బాటలు వేసిన ఆయన ఆ తర్వాత రాజకీయ రంగంలోకి ప్రవేశించి కేంద్ర బొగ్గు శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.



పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1942, మే4న జన్మించిన ఆయనకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే విపరీతమైన అభిమానం. అదే ఆయనను సినిమాల వైపు నడిపించింది. ఆయన మద్రాస్‌ వెళ్లి ఆదుర్తి సుబ్బారావు దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసి సినిమా దర్శకత్వంలో తనకంటూ ఓ ప్రత్యేకశైలిని అలవర్చుకున్నారు. ఆదుర్తి సుబ్బారావు దగ్గర శిష్యరికం చేసిన కె. విశ్వనాథ్, కె. బాలచందర్, రాఘవేంద్రరావు లాంటి వాళ్లకు భిన్నంగా సినిమాలు తీశారు. అవినీతి, లింగవివక్ష, అణచివేత లాంటి సామాజిక అంశాలను ఇతివృత్తాలుగా తీసుకొని ఆయన సినిమాలను సామాజిక మాధ్యమంగా ఎలా ఉపయోగించుకోవచ్చో చూపారు.



తెలుగు, హిందీ భాషల్లో 151 సినిమాలకు దర్శకత్వం వహించడం ద్వారా దాసరి నారాయణరావు ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు’ల్లోకి ఎక్కారు. 53 సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. మాటల రచయితగా, పాటల రచయితగా 250 సినిమాలకు పనిచేశారు. క్యారెక్టర్‌ నటుడిగా పలు చిత్రాలో నటించారు. మేఘ సందేశం, కంటే కూతుర్నే కనాలి లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపును కూడా పొందారు. మేఘసందేశం చిత్రాన్ని కాన్స్, షికాగో, మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో  ప్రదర్శించారు. తాత మనవడు, స్వర్గం నరకం చిత్రాల ద్వారా తెలుగు చిత్ర రంగంలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఎమ్మెల్యే ఏడుకొండలు లాంటి చిత్రాలతో సమకాలీన రాజకీయాలపై వ్యంగాస్త్రం సంధించారు. ఆశాజ్యోతి, ఆజ్‌ కా ఎమ్మెల్యే లాంటి చిత్రాలతో బాలీవుడ్‌లో ప్రవేశించినా, ఆయన అక్కడ పెద్దగా రాణించలేకపోయారు.



మేఘసందేశం, కంటే కూతుర్ని కనాలి చిత్రాలకు రెండు జాతీయ అవార్డులను, ఇతర చిత్రాలకు పలు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులతో పాటు తొమ్మిది నంది అవార్దులను అందుకున్నారు. మోహన్‌ బాబు, ఆర్‌. నారాయణమూర్తి లాంటి నటులను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయనకు భార్య దాసరి పద్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top