
చిక్కుల్లో అజయ్ దేవగన్
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ చిక్కుల్లో పడ్డారు.
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన నటించిన 'శివాయ్' సినిమా పోస్టర్ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొటూ తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బూట్లు ధరించిన హీరో.. శివుడి ఆకారం పైనుంచి దూకుతున్నట్టుగా పోస్టర్ లో చూపించారని, ఆదిశంకరుడిపై మంచు గొడ్డలి(ఐస్ యాక్స్)ని ప్రయోగించినట్టుగా కూడా ప్రచారచిత్రంలో ఉందని ఫిర్యాది ఆరోపించారు. ఢిల్లీకి చెందిన న్యాయవాది మన్మోహన్ సింగ్ ఈ ఫిర్యాదు చేశారు.
'శివాయ్' తొలి పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు. మంచు కొండల నుంచి తాడుతో వేలాడుతూ, చేతిలో ఆయుధంతో ఉన్న హీరోను పోస్టర్ లో చూపించారు. కాగా, ఈ పోస్టర్ పై శివభక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అజయ్ దేవగణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'శివాయ్' అక్టోబర్ 16న విడుదల కానుంది. సైరాబాను, దిలీప్‌కుమార్, సాయెషా సైగల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.