‘ఛపాక్‌’ ఫస్ట్‌ లుక్‌.. ఊహించని రీతిలో దీపిక

Chhapak First Look - Sakshi

యాసిడ్‌ దాడి. అది ఆమె శరీరాన్ని ఎంతగా బాధించిందో, అంతకంటే ఎక్కువగా మనసును వేధించింది. అయినా ఆమె పెదాలపై చిరునవ్వు చెదరలేదు. బహుశా ఆ చిరునవ్వే  గాయాలకు మందేమో..! బాధలు కన్పించకుండా దిగమింగుతుందేమో..! తన గెలుపుకు చిహ్నమేమో..! ఇలా ఎన్నో ఆలోచనల్ని రేకెత్తిస్తున్న ఆ నవ్వు మరెవరిదో కాదు బాలీవుడ్‌ క్వీన్‌ దీపికా పదుకొనెది. యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ నిజ జీవితకథతో ‘ఛపాక్‌’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మాలతి పాత్రలో దీపికా పదుకొనె నటిస్తుంది. నాకు జీవితాంతం గుర్తుండిపోయే పాత్ర ‘మాలతీ’ అంటూ దీపిక ఇన్‌స్టాగ్రామ్‌లో రివీల్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌కు గంటలోపే 5 లక్షలకుపైగా లైకులు వచ్చాయి. శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నావంటూ దీపికపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అప్పుడే అంచనాల్ని పెంచేస్తున్న ‘ఛపాక్‌’ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదలవుతుందని తెలిపింది.

ఒక ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ.. ‘పద్మావత్‌’ చిత్రం తర్వాత అలాంటి చిత్రాలు చేయడానికి మానసికంగా సిద్ధంగా లేను. ఏదైనా లవ్‌స్టోరీ చేయాలనుకున్నా. కానీ ఎప్పుడైతే మేఘనా గుల్జార్‌ ‘ఛపాక్‌’ స్క్రిప్ట్‌ వినిపించిందో అప్పుడే నా నిర్ణయాన్ని మార్చుకున్నా. కథ విన్న ఐదు నిమిషాల్లోనే సినిమా ఒప్పుకోవడమే కాకుండా, ఆ చిత్రానికి ప్రొడ్యూసర్‌గా మారాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. ఇక ఈ చిత్రం విషయానికొస్తే యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ తన జీవితంలో సాగించిన పోరాటమే ఈ కథా సారాంశం. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు విక్రాంత్‌ మాస్సే కీలక పాత్రలో నటించనున్నాడు. మొదట ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకోనున్న ఈ చిత్రం ఈ రోజే పట్టాలెక్కనుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top