వర్మ సినిమాకు లైన్‌ క్లియర్‌

Censor Board Issued Certificate Ram Gopal Varma New Telugu Movie - Sakshi

రాంగోపాల్‌ వర్మ వివాదస్పద చిత్రం ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’విడుదలకు మార్గం సుగుమమైంది. చిత్రాన్ని వీక్షించిన సెన్సార్‌ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ జారీ చేశారు. దీంతో రేపు(గురువారం) చిత్రం విడుదల కానుంది. విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో చిత్ర డైరెక్టర్‌ సిద్దూ, నిర్మాత నట్టి కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాపై బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివాదస్పదమైన ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ఎలా అనుమతి ఇస్తుందని, అదేవిధంగా విడుదల ఆపాలంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా ఈ పిటిషన్లపై సెన్సార్‌ బోర్డు​, చిత్ర యూనిట్‌ కౌంటర్‌ దాఖలు చేసింది. వాదనలు విన్న హైకోర్టు రివ్యూ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 

రివ్యూ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బుధవారం సాయంత్రం చిత్ర యూనిట్‌కు సెన్సార్‌ బోర్డు సభ్యులు సర్టిఫికేట్‌ను అందజేశారు. దీంతో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్లేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ మూవీకి సెన్సార్‌ సర్టిఫికేట్‌ రావడంపై రాంగోపాల్‌ వర్మ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్ర విడుదలను ఆపాలనుకున్న వాళ్లుకు బ్యాడ్‌ న్యూస్‌. ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ వచ్చింది. అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే డిసెంబర్‌ 12న చిత్రం విడుదల కానుంది. కొందరు జోకర్లు, కన్నింగ్‌ వ్యక్తులు సినిమా విడుదలను ఆలస్యం చేసినప్పటికీ భారత రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్చను ఆపలేకపోయారు’ అంటూ ట్వీట్‌ చేశాడు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top