పద్మావతి ఎఫెక్ట్‌‌.. సల్మాన్‌కీ కష్టాలు తప్పవా?

CBFC new rules effect on Salman Movie - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి సెన్సార్‌ సర్టిఫికేషన్‌ వివాదం ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సెన్సార్‌ నిబంధనల కారణంగా చిత్రం ఖచ్ఛితంగా పోస్ట్‌ పోన్‌ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు పాత నిబంధనలను తిరగదోడిన సీబీఎఫ్‌సీపై బాలీవుడ్‌ నిర్మాతలు మండిపడుతున్నారు. 

చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీ కావాలంటే మేకర్లు 68 రోజుల ముందుగానే సెన్సార్‌ బోర్డు వద్ద దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధన ఉంది. అయితే కొన్నేళ్లుగా ఆ రూల్‌ను బోర్డు పక్కనపడేసింది. ఇప్పుడు పద్మావతి చిత్రం వివాదాల్లో నానుతున్న నేపథ్యంలో అనూహ్యంగా మళ్లీ ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీనికితోడు మేకర్లు అందించిన డాక్యుమెంట్లు అసంపూర్తిగా ఉన్నాయంటూ సర్టిఫికెట్‌ జారీచేయకుండా వెనక్కి తిప్పి పంపించి వేసింది. ఇప్పుడు ఆ ప్రభావం సల్మాన్‌ ఖాన్‌ కొత్త చిత్రం టైగర్‌ జిందా హై చిత్ర విడుదలపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.  

సల్మాన్‌ నటించిన ఈ చిత్రం డిసెంబర్‌ 22న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కొద్దికాలంగా బాలీవుడ్‌ సినిమాలు కేవలం 22 రోజుల ముందుగానే సర్టిఫికెట్‌ కోసం సెన్సార్‌కు వెళ్తున్నాయి. కానీ, పాత నిబంధన మళ్లీ తెరపైకి రావటంతో ఇంత తక్కువ టైంలో టైగర్‌ జిందా హై చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికెట్‌ రావటం అనుమానంగా కనిపిస్తోంది. దీంతో సెన్సార్‌ తీరుపై బాలీవుడ్‌ నిర్మాతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ మధ్య కాలంలో 68 రోజుల పద్ధతిని పాటించి విడుదలైన చిత్రాల జాబితాను బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో సర్టిఫికెట్‌ జారీ విషయంలో పెనువివాదాలే చోటు చేసుకున్నాయి. గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ నటించిన మెసేంజర్‌ ఆఫ్‌ గాడ్‌ చిత్రానికి ఒక్క రోజు ముందుగానే సర్టిఫికెట్‌ ఇవ్వటం.. అది కాస్త తీవ్ర విమర్శలకు దారితీయటంతో అప్పుడు చైర్‌పర్సన్‌గా ఉన్న లీలా శామ్‌సన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top