వార్‌ వసూళ్లు: మరో భారీ రికార్డు

box office collection, War enters Rs 300-crore club - Sakshi

ముంబై : బాలీవుడ్‌ టాప్‌ హీరోలైన హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్‌ సినిమా వార్‌.. ఈ సినిమా ఊహించినట్టుగానే బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. గాంధీ జయంతి సందర్భంగా విడుదలైన వార్‌.. అప్రతిహతంగా కలెక్షన్లు రాబడుతూ.. మూడు వారాల్లోనే రూ. 300 కోట్ల క్లబ్బులోకి ఎంటరైంది. ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్‌ చిత్రాల్లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా వార్‌ రికార్డులకెక్కింది. వరుసగా మూడో వీకెండ్‌లోనూ వార్‌ కలెక్షన్లు పెద్ద ఎత్తున ఉండటం గమనార్హం. గాంధీ జయంతికి విడుదలై తొలిరోజే 50 కోట్లకుపైగా వసూలు చేసి.. బాలీవుడ్‌లోనే హైయ్యెస్ట్‌ ఓపెనర్‌గా నిలిచిన వార్‌.. దసరా సీజన్‌ను కూడా సద్వినియోగం చేసుకుంటూ దుమ్మురేపింది. ఇప్పుడు దీపావళి వరకు బాక్సాఫీస్‌ వద్దకు వార్‌కు గట్టి పోటీ లేకపోవడంతో వసూళ్లు ఇలాగే కొనసాగే అవకాశముంది.

మూడో వీకెండ్‌లో గత శుక్రవారం రూ. 2.80 కోట్లు, శనివారం రూ. 4.35 కోట్లు, ఆదివారం సుమారు రూ. 6 కోట్లు వసూలు చేసిన వార్‌ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కలపుకొని రూ. 301. 75 కోట్లు సాధించింది. ఇందులో హిందీ వెర్షన్‌ వాటా.. సుమారుగా 288.30 కోట్లుగా ఉంది. రూ. 300 కోట్లు వసూలు చేయడం ద్వారా ఈ ఏడాది విడుదలైన కబీర్‌ సింగ్‌ లైఫ్‌టైమ్‌ వసూళ్లను వార్‌ అధిగమించింది. అదేవిధంగా ఆమీర్‌ ఖాన్‌ ‘ధూమ్‌-3’ రికార్డును కూడా దాటింది. యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ (వైఆర్‌ఎఫ్‌)కు ఈ సినిమా అతిపెద్ద ఊరట అని చెప్పవచ్చు. వైఆర్‌ఎఫ్‌ నిర్మించిన థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ సినిమా గత ఏడాది దీపావళికి విడుదలై.. బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. భారీ నష్టాలను మిగిల్చిన ఆ ఘోర పరాభవం నుంచి వార్‌ సినిమాతో వైఆర్‌ఎఫ్‌ గట్టెక్కింది. అంతేకాకుండా వార్‌ జోరు కొనసాగించేందుకు త్వరలోనే మరో సీక్వెల్‌ను పట్టాలెక్కించబోతుంది. ఈ సినిమాలో హృతిక్‌ ఒక హీరోగా కొనసాగనున్నాడు. టైగర్‌ స్థానంలో మరో స్టార్‌ హీరోను సీక్వెల్‌లో తీసుకోనున్నారు. ఇక, ఓవర్సీస్‌లో సత్తా చాటిన వార్‌ సినిమా అంతర్జాతీయ మార్కెట్‌లో వందకోట్ల వసూళ్ల దిశగా సాగుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top