బిగ్‌బాస్‌ కన్నా సీరియల్స్‌ చూడటం బెటర్‌

Bigg Boss 3 Telugu Show Becoming Dull - Sakshi

చుక్కలనంటే రేటింగ్స్‌తో ప్రారంభమైన బిగ్‌బాస్‌ నిర్వాహకులకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన షో  పైన పటారం.. లోన లొటారం అన్నట్టుగా మారింది. బిగ్‌బాస్‌ 3 ప్రారంభమై 57 రోజులు పూర్తవుతున్నా ఇంటిసభ్యుల మధ్య ఇసుమంతైనా ఆ పోటీ కనిపించట్లేదు. అసలే బిగ్‌బాస్‌ పెద్దగా కష్టపడకుండా గత సీజన్‌ల నుంచి టాస్క్‌లను కాపీ కొడుతూ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాడు. ఇప్పటికే ఎవరు బెస్ట్‌ హోస్ట్‌ అని ఎప్పటినుంచో వాదులాటలు జరుగుతూనే ఉన్నాయి. ఇది చాలదన్నట్టు ఇంట్లో ఇచ్చే టాస్క్‌లు పాత సీజన్‌లను గుర్తు తేవటంతో ఈ మాత్రం దానికి బిగ్‌బాస్‌ 3 సీజన్‌ తీసుకురావటం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇంటిసభ్యుల్లో చాలామంది ఇప్పటికీ సేఫ్‌ జోన్‌లోనే గేమ్‌ ఆడుతున్నారు. వీటన్నింటి వల్ల బిగ్‌బాస్‌ షో రానురానూ బోరింగ్‌గా మారుతోంది. హోస్ట్‌ నాగార్జున  వీకెండ్‌లో చేసే సందడి కోసం అంతో ఇంతో చూస్తున్నారు తప్పితే పని కట్టుకుని చూసేంత ఎంటర్‌టైన్‌మెంట్‌ బిగ్‌బాస్‌లో లేదన్నది భోగట్టా.

ఇక ఇంటిసభ్యులు బోర్‌ కొట్టిస్తున్నారంటే బిగ్‌బాస్‌ స్క్రిప్ట్స్‌ అంతకన్నా నీరసంగా ఉంటున్నాయి. శారీరక హింసకు చోటు లేదంటూనే హింసాత్మక టాస్క్‌లు ఇవ్వటం.. పార్టిసిపెంట్స్‌ ఎంతో కష్టపడి ఆడిన తర్వాత టాస్క్‌లను రద్దు చేయడం అటు ఇంటి సభ్యులకు, ఇటు ప్రేక్షకులకు చికాకును కలిగిస్తున్నాయి. పైగా ప్రోమో, షో ఎడిటింగ్‌ కూడా సరిగా చేయట్లేదన్నది మొదటి నుంచి వినిపిస్తున్న వాదన. ఇంటిసభ్యుల్లో కొందర్ని మాత్రమే హైలెట్‌ చేస్తూ పక్షపాతం చూపిస్తున్నారు అనేవారూ లేకపోలేదు. అన్నింటికీ మించి లీకులను అరికట్టలేకపోయారు. సస్పెన్స్‌ అనేది లేకుండా అన్నీ ముందుగానే సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైపోవటంతో ఉత్కంఠ తగ్గిపోతోంది. వీటన్నింటి వల్ల ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నదానికి బదులుగా షో ఎప్పుడైపోతుందా అనుకునే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు సాగదీతలు ఎక్కువ ఉండటంతో ప్రేక్షకుల్లో అసహనం పెరుగుతోంది. షో చూడటం కన్నా సీరియల్స్‌ చూడటం బెటర్‌ అని పెదవి విరుస్తున్నారు.

వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా షోను తిరిగి పట్టాలెక్కిద్దామని భావించిన బిగ్‌బాస్‌ యాజమాన్యానికి నిరాశే ఎదురైంది. తొలి వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీగా ట్రాన్స్‌జెండర్‌ తమన్నాను తీసుకొచ్చినప్పటికీ ఆమె ప్రవర్తనపై అంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వైల్డ్‌ బిహేవియర్‌తో ముచ్చెమటలు పట్టించిన తమన్నాను మూడోవారానికే సాగనంపారు. పోనీ మరోసారి వైల్డ్‌కార్డ్‌ అదృష్టాన్ని పరీక్షిద్దాం అనుకుంటే అదీ బెడిసికొట్టింది. రెండో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఎంటరైన శిల్ప చక్రవర్తి మెరుపుతీగలా వచ్చిన ఒక్కవారానికే ఇంట్లో పొసగలేక తట్టాబుట్టా సర్దేసుకుంది. దీంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు కొత్త దారి వెతుక్కోక తప్పేలా లేదు. రానున్న రోజుల్లో రీఎంట్రీ ద్వారానైనా రీఎంటర్‌టైన్‌మెంట్‌ దొరుకుతుందా అనేది చూడాలి. ఇప్పటికైనా బిగ్‌బాస్‌ తప్పెక్కడ జరుగుతుందో తెలుసుకుని సరిదిద్దుకుంటే సరి.. లేదంటే ప్రేక్షకులు చిటికె వేసినంత సులువుగా చానల్‌ మార్చేయడం ఖాయం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top