బిగ్‌బాస్‌: మహేశా.. నువ్వు మారవా?

Bigg Boss 3 Telugu Netizens Trolled Mahesh For Playing Double Game - Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లో ఇంటిసభ్యులకు కింగ్‌ నాగార్జున సరిపోయే క్యాప్షన్స్‌ ఇచ్చారు. అయితే నాగార్జున ఇచ్చిన క్యాప్షన్‌కు నొచ్చుకున్న ఏకైక వ్యక్తి మహేశ్‌. పుల్లలు పెట్టడం అనే ట్యాగ్‌ను ఇంటిసభ్యులు ఎవరైనా గుర్తు చేస్తే చాలు.. ఒంటికాలిపై లేస్తాడు. ఉన్నమాటంటే ఉలుకెక్కువ అని ఊరికే అనలేదు అని మహేశ్‌ను చూస్తే తెలుస్తుంది. అందరితో కలిసిపోయానంటూనే అన్ని విషయాలు తెలుసుకుంటూ వారి రహస్యాలను అంగట్లో పెడుతున్నాడు. ఇది బిగ్‌బాస్‌ను వీక్షిస్తున్న ప్రేక్షకులకే కాదు.. ఇంటిసభ్యులకు కూడా తెలిసిన విషయం. ఇదే విషయాన్ని తాజా ఎపిసోడ్‌లోనూ వారు వెల్లడించారు.

ఇటు రాహుల్‌ టీం దగ్గరికొచ్చి వారితో మాట్లాడింది అంతా శ్రీముఖి టీం దగ్గరికెళ్లి  పూసగుచ్చినట్లు చెప్పాడు. అయితే ఇదే జరుగుతుందని రాహుల్‌ ముందుగానే అంచనా వేశాడు. అంతేనా.. మహేశ్‌ వెళ్లిపోయిన తర్వాత అతని తీరుపై శ్రీముఖి అనుమానం వ్యక్తం చేసింది. ఎటొచ్చి అతను పుల్లలు పెట్టడం వల్ల ఎవరికీ ఏమీ ఒరగలేదు. అంతా మహేశ్‌ తలకే చుట్టుకుంటోంది. బాబా బంటుగా పేరొందిన మహేశ్‌ మిగతా ఇంటిసభ్యుల దగ్గర బాబా భాస్కర్‌ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ వల్ల మొదటికే మోసం వస్తుందన్న విషయం మహేశ్‌కు ఇంకెప్పుడు అర్థం అవుతుందో!

మహేశ్‌ చెప్పిందే నిజం అయింది..
గత వారం వరుణ్‌, రాహుల్‌, పునర్నవి, మహేశ్‌లు నామినేషన్‌ రౌండ్‌లో ఉన్నారు. ఆ సమయంలో డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండాలని మహేశ్‌ బిగ్‌బాస్‌ను కోరుకున్నాడు. వీలైతే ట్రిపుల్‌ ఎలిమినేషన్‌ ఉన్నా పర్వాలేదంటూ బిగ్‌బాస్‌కు సూచించాడు. నామినేషన్‌లో ఉన్న అందరినీ పంపించి తాను మాత్రం హౌస్‌లోనే ఉండాలి అంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. ఇక వరుణ్ బ్యాచ్‌లోని నలుగురిలో ఒకరు వెళ్లిపోవాలని, వారికి ఆ బాధేంటో తెలియాలి అని తన విపరీత కోరికను బయట పెట్టాడు. అతను అనుకున్నట్టే పునర్నవి ఎలిమినేట్‌ అయింది. మహేశ్‌ చెప్పిందే నిజం అయింది. 

ఇక తాజా నామినేషన్‌లోనూ మహేశ్‌ ఎవరైతే వెళ్లిపోవాలని భావించాడో వారే మళ్లీ పోటీగా ఉన్నారు. మెడాలియన్‌ పవర్‌తో వితిక ఎలాగోలా నామినేషన్‌ నుంచి తప్పించుకుంది. ఇక వరుణ్‌, రాహుల్‌లతో పోలిస్తే మహేశ్‌కే తక్కువ ఫాలోయింగ్‌ ఉంది! అదీకాక అక్కడివి ఇక్కడ.. ఇక్కడవి అక్కడ చెప్తూ తనకు తానే నెగెటివిటీ తెచ్చుకుంటూ డేంజర్‌ జోన్‌లో పడ్డాడు. ఇక మహేశ్‌ రెండు నాలుకల ధోరణిని భరించలేకున్నామని, బిగ్‌బాస్‌ ఇంటికి గుడ్‌బై చెప్పే రోజులు దగ్గరపడ్డాయని నెటిజన్లు అంటున్నారు. అతన్ని ఎలిమినేట్‌ చేసి తగిన బుద్ధి చెపుతామంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top