బిగ్‌బాస్‌: టాస్క్‌లో రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌..

Bigg Boss 3 Telugu: Housemates Fight For Ticket To Finale - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి వితికా వెళ్లిపోయినా ఆమె జ్ఞాపకాల్లో బందీ అయిన వరుణ్‌ తనను తలుచుకుంటూ బాధపడ్డాడు. ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు కారుస్తున్న వరుణ్‌ను.. రాహుల్‌, అలీ ఊరడించే ప్రయత్నం చేశారు. ఇక బిగ్‌బాస్‌ పద్నాలుగోవారానికిగానూ నామినేషన్‌ ప్రక్రియను కాస్త భిన్నంగా ఇచ్చాడు. ఇందులో గెలిచే ఒక్కరే ‘టికెట్‌ టు ఫినాలే’ సొంతం చేసుకుంటారని, మిగతా అయిదుగురు నామినేట్‌ అవుతారని ప్రకటించాడు. బిగ్‌బాస్‌ ఇచ్చిన ‘బ్యాటరీ ఉంటే నిండుగా.. జరుపుకోండి పండగ’ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులందరూ వివిధ కలర్‌ బ్లాక్స్‌ను ఎంచుకున్నారు. అందులో ఉన్న నెంబర్‌ శాతం ప్రకారం.. బాబా భాస్కర్‌.. 40 %, రాహుల్‌, శ్రీముఖిలు.. 50 %, శివజ్యోతి 60 %, అలీ.. 70% ల బ్యాటరీ పర్సెంటేజ్‌తో ఆట స్టార్ట్‌ చేశారు.

సైరన్‌ మోగిన ప్రతీసారి ఇంటి సభ్యుల బ్యాటరీ లెవల్స్‌ తగ్గుతూ వస్తాయి. అయితే బజర్‌ మోగినప్పుడు గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన రెండు గంటలను ఎవరు ముందుగా మోగిస్తారో వారు బ్యాటరీ రీఫిల్‌ చేసుకోడానికి టాస్క్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇందుకోసం వారి బ్యాటరీలను చూపించే పట్టికను బిగ్‌బాస్‌ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశాడు. ఒకేసారి గంట కొట్టిన అలీ-శివజ్యోతి.. రాహుల్‌-వరుణ్‌.. బాబా భాస్కర్‌-శ్రీముఖి టాస్క్‌ల్లో తలపడ్డారు. అరటిపండ్ల టాస్క్‌లో శివజ్యోతి 15 మాత్రమే తినగా, అలీ 21 తిని రీఫిల్‌ చేసుకునే అవకాశాన్ని పొందాడు. రాహుల్‌, వరుణ్‌లకు థర్మాకోల్‌ నింపిన సంచులను ఇచ్చి ఒకరి సంచిని మరొకరు ఖాళీ చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ పేర్కొన్నాడు. ఇందులో వరుణ్‌, రాహుల్‌ భీకర పోరాటం చేయగా చివరగా రాహుల్‌దే పైచేయి అయింది.

బాబా, శ్రీముఖిలు.. ఆల్ఫాబెట్‌ కాయిన్స్‌ను పిండి, ఈకలు ఉన్న డబ్బాలో నుంచి కేవలం నోటి సహాయంతో తీయాల్సి ఉండగా ఇద్దరూ సమానంగా తీయగా టై అయింది. దీంతో టాస్క్‌ను ముందుగా పూర్తి చేసిన బాబా భాస్కర్‌ విజయం సాధించాడని బిగ్‌బాస్‌ ప్రకటించాడు. కాగా వారికిచ్చిన టాస్క్‌ల్లో గెలిచిన అలీ, రాహుల్‌, బాబా 10 శాతం బ్యాటరీలను పెంచుకున్నారు. ఇక అర్ధరాత్రి బజర్‌ మోగినప్పుడు బెల్‌ కొట్టిన బాబా, అలీ ఇద్దరూ చివరగా తలపడ్డారు. మట్టి నింపిన డబ్బాలో తలా ఒక రంగును పూలను నిలబెట్టాల్సి ఉంటుంది. ప్రత్యర్థి పూలను పీకే ప్రయత్నం కూడా చేయవచ్చని బిగ్‌బాస్‌ సూచించాడు. ఈ క్రమంలో అలీ, బాబాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చాలా రోజులకు ఫిజికల్‌ టాస్క్‌ రావటంతో అలీ తన శక్తినంతా కూడబెట్టుకుని బాబాపై విరుచుకుపడుతున్నాడు. బాబా పెట్టిన పూలను దూరంగా విసిరి పారేస్తున్నాడు. బాబా తన పూలను కాపాడుకోడానికి ఎంతో కష్టపడుతున్నాడు. మరి ఈ భీకర పోరులో విజయం ఎవరిని వరించనుంది అనేది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top