స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా : బెల్లంకొండ సురేశ్‌  

Bellamkonda Suresh Talk About His Son Sai Srinivas Film Rakshasudu - Sakshi

‘‘రాక్షసుడు’ సినిమా బడ్జెట్‌ రూ.22 కోట్లు అయ్యింది. ఆంధ్ర, సీడెడ్, నైజాం థియేట్రికల్‌ రైట్స్‌ రూ.12 కోట్లు అమ్ముడు కాగా, హిందీ శాటిలైట్‌ రూ.12 కోట్లు, తెలుగు శాటిలైట్‌ రూ.5.90కోట్లు వ్యాపారం జరిగింది. మొత్తంగా రూ.30 కోట్లకు ఈ సినిమాను అమ్మాం. థియేట్రికల్‌ రైట్స్‌కు పెట్టిన ఖర్చు రూ.12 కోట్లు సోమవారానికే వచ్చాయి’’ అని బెల్లంకొండ సురేశ్‌ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా రమేశ్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. మంగళవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో బెల్లంకొండ సురేశ్‌ మాట్లాడుతూ– ‘‘చాలా చోట్ల వర్షం వల్ల ‘రాక్షసుడు’ కలెక్షన్లకు అంతరాయం కలిగింది. వర్షం లేకుంటే కలెక్షన్స్‌ సునామీ సృష్టించేది. ఫస్ట్‌ వీక్‌ కంటే సెకండ్‌ వీక్‌ బాగున్నాయి. వైజాగ్, ఈస్ట్‌ హక్కులను నేనే కొన్నాను. వైజాగ్‌లో సోమవారానికే రూ.2 కోట్లు వచ్చాయి. ఇంత మంచి సినిమాను నాకు ఇచ్చిన రమేశ్‌ వర్మగారికి, కోనేరు సత్యనారాయణగారికి, హవీశ్‌గారికి రుణపడి ఉంటాను. ఈ సినిమాకు కథే హీరో.. ఆ తర్వాత పని చేసినవారందరూ హీరోలే. జీబ్రాన్‌ ఫస్ట్‌ హీరో, ఆ తర్వాతే మా అబ్బాయే హీరో. ఈ నెల 15 తర్వాత టూర్‌ ప్లాన్‌ చేస్తాం. ‘అల్లుడు శీను’కి మించిన వినోదం, పాటలుండి స్క్రిప్ట్‌ కుదిరితే మా అబ్బాయితో సినిమా చేస్తాను. గ్రాండ్‌ సినిమానే తీస్తాను. ‘జయజానకీ నాయకా’ భారీ బడ్జెట్‌తో తీశాం. కొంచెం నష్టపోయాం. మంచి కథ కుదరగానే మిర్యాల రవీందర్‌ రెడ్డితో కలిసి ఓ సినిమా చేస్తాను. అభిషేక్‌తో ‘సాక్ష్యం’ సినిమా చేశాను. ఆ తర్వాత ‘కవచం, సీత’ లాంటి సినిమాలు  కొని, నష్టపోయినవాళ్లతో మా అబ్బాయి సినిమా చేసేలా చూస్తాను. మా అబ్బాయిని స్టార్‌ హీరోని చేయాలనే పెద్ద సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ఎవరైనా తమ పిల్లలు పెద్ద పొజిషన్‌లోనే ఉండాలనుకుంటారు కదా. ఇండస్ట్రీలో, యూ ట్యూబ్‌లో తనకు మంచి బిజినెస్‌ క్రియేట్‌ అయ్యింది’’ అన్నారు. ‘‘రాక్షసుడు’ సినిమాకి 10రోజుల్లోనే లాభాలు సాధించాం’’ అన్నారు నిర్మాత ‘మల్టీడైమన్షన్‌’ వాసు. ‘‘తొలివారంలో నాలుగో రోజు వసూళ్లు కాస్త డల్‌ కాగానే భయపడ్డా. రెండో వారంలో అద్భుతంగా ఉన్నాయి’’ అన్నారు రమేశ్‌ వర్మ. సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘మా సినిమా విడుదలైన 10వ రోజుకే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ సేఫ్‌ అయ్యారు. ఆర్టిస్ట్‌గా పేరు రావడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్నను గర్వపడేలా చేయాలనుకున్నాను. అందరూ హీరోగా నా జాబ్‌ ఈజీ అనుకుంటారు. ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఇక్కడ పేరు తెచ్చుకుంటే నాన్నకు అది సంతోషం ఇస్తుంది. రీమేక్‌ సినిమా హిట్‌ చేయడం చాలా కష్టం. ఇందులో నేను చేసిన పాత్ర మిగతా సినిమాల్లా కాదు. చాలా అండర్‌ ప్లే చేయాల్సిన క్యారెక్టర్‌ నాది. అందుకే ప్రయోగాత్మక సినిమా అని చెప్పొచ్చు. ఇక పై కూడా మంచి కథల్ని ఎంపిక చేసుకుంటూ అలరిస్తాను’’ అన్నారు.

‘మా అబ్బాయి సినిమాల్లో నేనెక్కువగా ఇన్వాల్స్‌ అవుతానని అందరూ అనుకుంటారు. కానీ పెద్దగా జోక్యం చేసుకోను. సెట్‌కి కూడా తక్కువ వెళ్తాను. తమిళ ‘రాక్షసన్‌’లో ఓ ఎమోషనల్‌ సీన్‌ ఉంది. ఆ సీన్‌ మా అబ్బాయి ఎలా చేస్తాడా? అనుకున్నా. ఆ సీన్‌ తీశాక చూశాను. అప్పుడే హిట్‌ అవుతుందనుకున్నా. మా రెండో అబ్బాయి గణేశ్‌ని కూడా హీరోని  చేయబోతున్నాను. కథ, డైలాగ్‌ వెర్షన్‌  రెడీ అయ్యాయి’ అని బెల్లంకొండ సురేష్‌ అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top