
ఈ శుక్రవారం రెండు తెలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఒకటి తేజ సజ్జా 'మిరాయ్' కాగా.. మరొకటి బెల్లంకొండ శ్రీనివాస్ 'కిష్కింధపురి'. అయితే ఈ రెండింటికీ యునానిమస్ హిట్ టాక్ ఏం రాలేదు. కొందరికి ఈ చిత్రాలు నచ్చగా.. మరికొందరు మాత్రం రెండూ యావరేజ్‌గానే ఉన్నాయని అంటున్నారు. కలెక్షన్ విషయానికొస్తే 'మిరాయ్'కి రూ.27.20 కోట్ల గ్రాస్ వచ్చినట్లు అధికారికంగానే వెల్లడించారు.
(ఇదీ చదవండి: Bigg Boss 9 డేంజర్ జోన్‌లో వీళ్లే.. లక్స్ పాపపై ఎలిమినేషన్ వేటు?)
మరోవైపు 'కిష్కింధపురి' టీమ్ నుంచి అధికారిక ప్రకటన అయితే ఏం లేదు. కానీ తొలిరోజు ఈ చిత్రానికి ఓ మాదిరి వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగులో మాత్రం ఈ చిత్రం రిలీజ్ కాగా.. దేశవ్యాప్తంగా రూ.2 కోట్ల నెట్ వసూళ్లు సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ సమాచారం. ప్రస్తుతానికి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం కాస్తోకూస్తో ఎంటర్‌టైన్ చేస్తోంది. అయితే 'మిరాయ్' వల్ల కాస్త నంబర్స్ తగ్గొచ్చు గానీ 25వ తేదీ వరకు చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలేం లేవు. ఇది 'కిష్కింధపురి'కి ఏమైనా ప్లస్ అవుతుందేమో చూడాలి.
'కిష్కింధపురి' విషయానికొస్తే.. రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలి(అనుపమ) లవర్స్. ఓ సంస్థలో పనిచేస్తుంటారు. ఘోస్ట్ వాకింగ్ టూర్స్ పేరుతో కొందరిని హాంటెడ్ ప్లేసులకు పట్టుకెళ్తుంటారు. ఓ సందర్భంలో ఊరికి చివరలో ఉన్న 'సువర్ణమాయ రేడియో స్టేషన్'కి వెళ్లొస్తారు. అలా వెళ్లొచ్చిన 11 మందిలో ముగ్గురు చనిపోతారు. దీంతో అసలు ఎందుకు ఇలా జరుగుతుందా అని రాఘవ్ కనుక్కొనే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ రేడియో స్టేషన్‌లో ఉన్న దెయ్యం ఎవరు? చివరకు రాఘవ్ అతడితోపాటు వెళ్లిన వాళ్లు బతికారా లేదా అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'కూలీ'లో నటించి తప్పు చేశా.. ఆమిర్ అంత మాటన్నాడా?)