'బాలకృష్ణుడు' మూవీ రివ్యూ

Balakrishnudu movie review - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

టైటిల్ : బాలకృష్ణుడు
జానర్ : కమర్షియల్ ఎంటర్ టైనర్
తారాగణం : నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, అజయ్, పృధ్వీ
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం : పవన్ మల్లెల
నిర్మాత : బి. మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి

స్టార్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నారా రోహిత్, నటుడిగా మంచి మార్కులు సాధిస్తున్నా కమర్షియల్ సక్సెస్ లు సాధించటంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాత్మక చిత్రాల మీదే దృష్టి పెట్టిన నారావార్బాయి... తొలిసారిగా ఓ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆరు పాటలు, నాలుగ ఫైట్లు, పంచ్ డైలాగ్ లు, భారీ చేజ్ లు వీటికి తోడు హీరోయిన్ గ్లామర్ షో.. ఇలా కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులతో రూపొందిన బాలకృష్ణుడు నారా రోహిత్ కు కమర్షియల్ హీరో ఇమేజ్ తీసుకువచ్చిందా..?

కథ :
కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో 2006లో సినిమా కథ మొదలవుతుంది. రవీందర్ రెడ్డి (ఆదిత్య) ఆ ప్రాంత ప్రజల జీవితాలను మార్చాలనుకునే ప్రజల మనిషి, తన చెల్లెలు భానుమతి దేవీ (రమ్యకృష్ణ) ఆలోచనల ప్రకారం తమ ప్రాంతంలో కాలేజీలు ఫ్యాక్టరీలు కట్టి అందరికీ చదువు, ఉద్యోగం అందుబాటులోకి తీసుకురావాలనుకుంటారు. జనంలో రవీందర్ రెడ్డికి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రత్యర్థి బసిరెడ్డి (మహదేవన్) రగిలిపోతాడు. కానీ రవీందర్ రెడ్డి చేతిలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి చావును కళ్లారా చూసిన బసిరెడ్డి కొడుకు ప్రతాపరెడ్డి (అజయ్) దొంగ దెబ్బతీసి రవీందర్ రెడ్డిని చంపేస్తాడు.

తాను పోయినా తన ఆశయం మాత్రం బతకాలని ఆఖరి నిమిషంలో చెల్లెలుతో మాట తీసుకుంటాడు రవీందర్ రెడ్డి. (సాక్షి రివ్యూస్) అన్నకిచ్చిన మాట కోసం ప్రతాపరెడ్డి లాంటి రాక్షసుడితో పోరాటానికి సిద్ధమవుతుంది భానుమతి. రవీందర్ రెడ్డిని చంపిన కేసులో ప్రతాపరెడ్డి జైలుకెళతాడు. తన అన్నకూతురు ఆధ్య (రెజీనా) ఈ గొడవలకు దూరంగా పెంచుతుంటుంది భానుమతి. పదకొండేళ్ల తరువాత సత్ప్రవర్తన కింద ప్రతాపరెడ్డి జైలు నుంచి విడుదలవుతున్నాడని తెలుసుకున్న భానుమతి, తన ఆధ్యని కాపాడేందుకు బాలు (నారా రోహిత్)ను బాడీ గార్డ్ గా పెడుతుంది. ప్రతాపరెడ్డి నుంచి ఆధ్యను బాలు ఎలా కాపాడాడు..? ఈ ప్రయాణంలో బాలు, ఆధ్యలు ఎలా దగ్గరయ్యారు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
తొలిసారిగా రొటీన్ కమర్షియల్ సినిమాలో నటించిన నారా రోహిత్, అందుకు తగ్గ ఫిజిక్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లోనూ చాలా మార్పులు చూపించాడు. ఎక్కువగా సెటిల్డ్ రోల్స్ లోనే కనిపించిన ఈ యంగ్ హీరో ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. కమర్షియల్ సినిమాకు కీలకమైన యాక్షన్ సీన్స్, డ్యాన్స్ ల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. హీరోయిన్ గా రెజీనా ఆధ్య పాత్రలో అలరించింది. అభినయంతో పాటు అందాల ప్రదర్శనతోనూ ఆకట్టుకుంది. కీలకమైన భానుమతి పాత్రలో రమ్యకృష్ణ నటన సినిమాకు మరో ఎసెట్,  నీలాంబరి తరహా పాత్రలో కనిపించిన రమ్యకృష్ణ తనకు అలవాటైన హావాభావాలతో భానుమతి పాత్రను పండించింది.(సాక్షి రివ్యూస్) విలన్ గా నటించిని అజయ్ ది రొటీన్ ఫ్యాక్షన్ విలన్ పాత్రే, తన వంతుగా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు అజయ్. డిస్కవరీ ఫొటోగ్రాఫర్ మాధవరావు పాత్రలో పృథ్వీ ఇరగదీశాడు. లాంగ్ గ్యాప్ తరువాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించిన ఈ కామెడీ స్టార్ అద్భుతమైన టైమింగ్ తో అలరించాడు.

విశ్లేషణ :
కమర్షియల్ ఫార్ములా తీయాలన్న ఆలోచనతో బాలకృష్ణుడు సినిమా కథ రెడీ చేసుకున్న దర్శకుడు పవన్ మల్లెల పక్కా ఫార్ములా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొటీన్ కమర్షియల్ యాక్షన్ సినిమాలో ఉండాల్సిన ఫైట్లు, గ్లామర్, పంచ్ డైలాగ్ లు, చేజ్ లు, పాటలు ఇలా అన్ని సమపాళ్లలో ఉండేలా చూసుకున్నాడు. నారా రోహిత్ ను సరికొత్త యాంగిల్ లో ప్రజెంట్ చేయటంలో సక్సెస్ సాధించాడు. అయితే ఈ తరహా కథా కథనాలు కాలం చెల్లిపోయి దశాబ్దం పైనే అవుతుంది. (సాక్షి రివ్యూస్) మరి ఇప్పుడు ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ మణిశర్మ సంగీతం. తన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు మణి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
నారా రోహిత్ నటన
పృథ్వీ కామెడీ
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథా కథనం

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top