మరో వారసురాలి తెరంగేట్రం

Arun Pandian Daughter Keerthy Pandian Entered Into Bollywood - Sakshi

తమిళసినిమా: సాధారణంగా సినీ వారసులు నటులే అయ్యి ఉంటారు. నటీమణుల వారసత్వం తక్కువే. అయితే అది ఇంతకుముందు సంగతి. ఇప్పుడు వారసత్వ నటీమణుల సంఖ్య అధికం అవుతోంది. తాజాగా ఓ సీనియర్‌ నటుడి వారసురాలు కథానాయకిగా రంగప్రవేశం చేసింది. అరుణ్‌పాండియన్‌ ఈ పేరు తమిళసినిమాకు సుపరిచితం. కథానాయకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పలు చిత్రాలు చేసిన అరుణ్‌పాండియన్‌ వారసురాలు కథానాయకిగా రంగప్రవేశం చేసింది. ఆయనకు ముగ్గురు కూతుళ్లు. వారిలో మూడో కూతురు కీర్తీపాండియన్‌. ఈమె ఇప్పటికే స్టేజీ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. తమిళం, ఆంగ్లం భాషల్లో ఇప్పుటికి 20కి పైగా నాటకాలాడింది. అంతే కాదు చిత్ర నిర్మాణరంగంలో, డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో తన తండ్రికి కుడిభుజంగా వ్యవహరించింది. అరుణ్‌పాండియన్‌ తమిళ చిత్రాలను సింగపూర్‌ వంటి విదేశాల్లో డిస్ట్రిబ్యూషన్‌ చేస్తుంటారు. కాగా కీర్తీ పాండియన్‌కిప్పుడు రంగస్థలం నుంచి వెండితెరకు ప్రమోషన్‌ వచ్చింది. అవును ఈమె హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం నిర్మాణంలో ఉంది. ఎదిర్‌నీశ్చల్, కాక్కీసట్టై చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన హరీష్‌రామ్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కనా చిత్రం ఫేమ్‌ దర్శన్‌ హీరోగా నటిస్తున్నారు.

దీని గురించి కీర్తీ ఏమంటుందో చూద్దాం. గత 5 ఏళ్లుగా నాన్న వ్యాపార బాధ్యతలను చూసుకుంటున్నాను. సింగపూర్‌లో చిత్రాలను డిస్ట్రిబ్యూషన్‌ చేస్తున్నాను. అయితే నాకు నటన అంటే చాలా ఆసక్తి. గత మూడేళ్లుగా నాటకాల్లో నటిస్తున్నాను. నటనను నేర్చుకున్న తరువాతనే సినిమాల్లోకి రావాలని భావించాను. ఇంతకుముందు చాలా సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే హీరోయిన్‌ పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడంతో అంగీకరించలేదు. నా నటనా ప్రతిభను నిరూపించుకోవాలనే గానీ హీరోయిన్‌ అనే పేరు కోసం నేనీ రంగంలోకి రావడంలేదు. ప్రస్తుతం నేను నటించడానికి అంగీకరించిన చిత్రం మంచి కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది. షూటింగ్‌ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. సినీ రంగప్రవేశం చేసినా నాటకాల్లో నటిస్తూనే ఉంటా. నాటక రంగానికి దూరం కాలేను అని కీర్తీ పాండియన్‌ చెప్పింది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top